తెరుచుకోనున్న పూరి జగన్నాథ్ ఆలయం రత్నభండారం

ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (16:54 IST)
దేశంలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి. ఇది ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయంలో రత్నభండాగారం ఉంది. దీన్ని తెరిచేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చర్యలు ఇప్పటికి ఫలించాయి. ఈ రత్నభండారాన్ని తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు అనుమతులు జారీ చేసింది. 
 
రత్న భండారంలోని మొత్తం ఏడు గదుల్లో అమూల్యమైన వజ్రవైఢూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ భండారాన్ని తెరిచేందుకు అనుమతులు రావడంతో సర్వత్రా అమితమైన ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ భండారాన్ని తొలుత 1984లో ఆ తలుపులు తెరిచారు. 
 
అయితే నాలుగో గది నుంచి నాగుపాముల బుసలు వినిపించాయి. నాగశబ్ధం కారణంగా ఆ గదిని తెరవలేదని అప్పటి అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు రత్నభండారం తలుపులు తెరిస్తే అరిష్టమంటూ కొన్ని ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. క్రీస్తుశకం 1078వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం వెనుక సైన్సుకు అందని అనేక రహస్యాలు ఇప్పటికీ రహస్యాలుగానే ఉన్నాయి. 
 
కాగా, గతంలో కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోనూ ఆరు గదుల్లో అనంతమైన నిధినిక్షేపాలు ఉన్నాయని తెలియడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందులోని 5 గదులను తెరిచారు. తర్వాత కొంతకాలానికి నాగబంధం ఉన్న ఆరో గదిని కూడా ధైర్యం చేసి తెరిచి అందులోని అపార సంపదను అధికారులు లెక్కించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు