శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవిని మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు ఏర్పడింది. సింహవాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో ఈ తల్లి దర్శనమిస్తుంది.
దేవతలందరి శక్తులు ఈమెలో ఉంటాయి. గొప్పతేజస్సుతో ప్రకాశిస్తుంటుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. మహిళల్ని చిన్నచూపు చూడటం, వారిని విలాసవస్తువుగా భావించటం మొదలైన లక్షణాలకు మహిషుడు ఉదాహరణ.
ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ, అవసరమైతే పరాక్రమాన్ని ప్రదర్శించటానికి అనుక్షణం సన్నద్ధంగా ఉండాలనే సందేశాన్ని మహిషాసురమర్దనీదేవి అలంకారం నుంచి అందుకోవాలి.