శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. అల్లుడైన కడప వెంకన్నను దర్శించుకున్న ముస్లింలు

బుధవారం, 29 మార్చి 2017 (11:40 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉగాది పురస్కరించుకుని ఆనంద నిలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు. బంగారువాకిలిలో బుధవారం రాత్రికి పంచాంగశ్రవణం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది ఆస్థానం సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జితసేవలు సహస్రకళశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 
 
మరోవైపు శ్రీవారి ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే కడప జిల్లాలోని దేవునికడప శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ తంతు జరుగుతుంది. ఈ ఏడాది కూడా కడప శ్రీవారి ఆలయాన్ని ముస్లింలు సందర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఇద్దరు భార్యల్లో ఒకరైన బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ కావడంతో స్వామివారిని తమ అల్లుడుగా భావించి ముస్లింలు ఉగాది రోజున ఆయన్ని దర్శించుకుంటారు. 
 
ఇక శ్రీవారు, బీబీ నాంచారమ్మ బాగుండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు దేవునికడపలోని శ్రీవారి ఆలయానికి పోటెత్తారు. 

వెబ్దునియా పై చదవండి