శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది, వాహనసేవలు ఎలా..?

శనివారం, 19 సెప్టెంబరు 2020 (13:28 IST)
తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కన్యా మాసం హస్త నక్షత్రంలో శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
 
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
 
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానించారు.
 
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.
 
ఈ నెల 23వ తేదీ గ‌రుడ‌సేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందువ‌ల్ల గ‌రుడ‌సేవ రోజు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు సమర్పించనున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తాం. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది.
 
24వ తేదీ ఉద‌యం ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప‌తో క‌లిసి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటారు. అనంత‌రం ఉద‌యం 7 గంట‌ల‌కు నాద‌నీరాజ‌న వేదిక మీద జ‌రిగే సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ర్ణాట‌క స‌త్రాల నిర్మాణానికి ముఖ్య‌మంత్రులిద్ద‌రు భూమిపూజ చేస్తారు.
 
ఈసారి స్వ‌ర్ణ‌ర‌థం, ర‌థ‌రంగ డోలోత్స‌వం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఈ నెల 27వ తేదీన చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి. తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భ‌‌క్తులు భ‌క్తితో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఈ ఏడాది కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో పాల‌క‌మండ‌లి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు