తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన.. ఎందుకు..?

శుక్రవారం, 7 జులై 2017 (14:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు కొన్ని బాగానే ఉన్నా.. మరికొన్ని మాత్రం సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారాంతంలో దివ్యదర్శనం టోకెన్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తితిదే నిన్న అర్థరాత్రి నుంచి అమలు చేస్తోంది. అయితే ఉన్నట్లుండి తితిదే తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు.
 
గురువారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు దివ్యదర్శనం టోకెన్లను నిలిపివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలినడక దర్శనానికి వెళితే త్వరితగతిన దర్శనం అవుతుందనుకుంటే చివరకు సర్వదర్శనంకు వెళ్ళాల్సిన పరిస్థితిని తితిదే తీసుకొచ్చిందని భక్తులు మండిపడ్డారు. తితిదే స్పష్టమైన ప్రకటన, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. అలిపిరి పాదాల మండపం భక్తులు ఆందోళనకు దిగారు. 
 
చంటిబిడ్డలతో వచ్చిన భక్తుల పరిస్థితి మరింత వర్ణనాతీతం. గంటలకు గంటలు నడిచి వెళ్ళి..తిరిగి గంటలకు గంటలు కంపార్టుమెంట్లలో కూర్చోవాలంటే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. తితిదే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి