తిరుమల తిరుపతి ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించినపుడు అనేక విమర్శలు చెలరేగాయి. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని ఎలా నియమిస్తారంటూ అనేక మంది ప్రశ్నించారు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలు చేయని ఈవో అనిల్ కుమార్.. ఇపుడు తన నిర్ణయాలతో భక్తులతో పాటు.. తితిదే సిబ్బంది కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.
'సారీ సార్. మంత్రిగారు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం టికెట్లు ఇస్తాం. సిఫారసులకు ఇవ్వలేం'... 'నేను మంత్రికి స్వయానా సోదరుడినయ్యా.. కుటుంబం అంతా వచ్చాం. ఇప్పుడు లేదంటే ఎలా?'.. 'వేసవి రద్దీ చాలా తీవ్రంగా ఉంది సార్. ఈవో గారు నిర్ణయం తీసుకున్నారు. సహకరించండి ప్లీజ్'.. అంటూ తిరుమల దైవదర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తితిదే సిబ్బంది తిరస్కరిస్తున్నారు. మంత్రి బంధువైనా, బామ్మర్ది అయినా బ్రేకు దర్శనం లేదు. వేసవి రద్దీతో బ్రేకులు కట్టుదిట్టం. రోజుకు 300లకు మించకుండా కట్టడి చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు.
ఇదే అంశంపై తిరుమల జేఈవో కార్యాలయం సిబ్బందికీ, రాష్ట్రమంత్రి ఒకరి సోదరుడికీ మంగళవారం ఉదయం జరిగిన సంభాషణ ఇది. వెంటనే మంత్రిగారు లైన్‌లోకి వచ్చారు. మరింత వినయంగా సిబ్బంది మళ్లీ అదేసమాధానం ఇచ్చారు. సామాన్య భక్తుల కోసం సహకరించమంటూ అభ్యర్థించారు. ఆగ్రహించినా, అభ్యర్థించినా ఏం చేయలేని పరిస్థితి! మంత్రిగారి ఇలాకా వెనుతిరగక తప్పలేదు. వేసవి రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్‌కే పరిమితం చేశారు. ఇలా కఠినంగా వ్యవహరించడంతో వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చిన వారు ఖంగు తింటున్నారు.