‘ముక్కనుమ’ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతం చేస్తే...?

శనివారం, 14 జనవరి 2017 (20:03 IST)
కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. 
 
ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు, తాంబూలం వాయనంగా ఇస్తారు. 
 
ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.

వెబ్దునియా పై చదవండి