ఒలింపిక్ గ్రామానికి వెళ్ళే క్రీడాకారులు, అభిమానులు జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి. ఒలింపిక్ విలేజ్‌లో క్రీడాకారులకు అరకొర వసతులు, ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో.. మాదకద్రవ్యాల ముఠాలు.. డబ్బు కోసం బెదిరింపులు, హత్యలు, వ్యభిచారం వంటివి కూడా ఒలింపిక్ గ్రామానికి సమీపంలో జరుగుతున్నాయి.
రియో ఒలింపిక్స్‌లో జరుగుతున్న చీకటి కోణం ఇప్పుడు ప్రపంచం దృష్టిలో కొంత ఆందోళన కలిగిస్తోంది. దొంగతనాలు, దోపిడీలు, రౌడీయిజం, మాదకద్రవ్యాలు, వ్యభిచారం ఇవన్నీ బెంబేలెత్తిస్తున్నాయి. డబ్బు కోసం బెదిరింపులు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. బ్రెజిల్‌లో వ్యభిచారం చట్ట బద్ధం. కాబట్టి సెక్స్ వర్కర్లు ఒలింపిక్స్‌లో ఆర్జన కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.
ఆ టైమ్ కాస్త వచ్చేయడంతో.. కాల్ గర్ల్స్ ముఠాలు కూడా రెచ్చిపోతున్నారు. మైనర్లు కూడా ఈ వ్యాపారంలో మగ్గిపోతున్నారంటే ఈ చీకటి కోణం ఎంతగా భయపెడుతోందో అర్థం చేసుకోవచ్చు. 2014లో అక్కడ వరల్డ్ సాకర్ పోటీలు నిర్వహించినప్పుడూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
వెలుగుజిలుగులతో మెరిసిపోయే ఒలింపిక్ స్టేడియానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పేదరికంతో కునారిల్లే మురికివాడలు ఉన్నాయి. స్థానికంగా వాటిని ‘ఫావెలా’గా వ్యవహరిస్తారు. గన్స్, డ్రగ్స్, వయొలెన్స్, మర్డర్స్.. ఇవన్నీ అక్కడివారు సర్వసాధారణంగా భావిస్తారు. ముఠాలకు, పోలీసులకు మధ్య కాల్పులు అక్కడ సహజం. నాలుగు డాలర్ల కోసం ఆడపిల్లలను అమ్ముకునేవారూ ఉంటారు.
సెక్స్ ట్రాఫికింగ్ గ్యాంగుల దృష్టి ఎప్పుడూ ఆ పేద కుటుంబాలపైనే ఉంటుంది. మరికొందరు బాలికలు కిడ్నాప్ కు గురై బలవంతంగా ఈ ఊబిలో కూరుకుపోయారు. వారికి బలవంతంగా మాదకద్రవ్యాలు ఇచ్చి ఎత్తుకుపోయే ఘటనలు ఎన్నో జరిగాయి.
మగపిల్లలు చిన్నప్పుడే తుపాకులు చేతబట్టేస్తున్నారు. ఇప్పటికే ఒలింపిక్స్ విలేజ్ దరిదాపుల్లో దొంగతనాలూ భారీగానే జరుగుతున్నాయి. ఏమాత్రం ఒంటరిగా కనిపించినా దోపిడీ చేసేస్తున్నారు. దీంతో క్రీడాకారులు ఎవరూ చెప్పా పెట్టకుండా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. సెక్యూరిటీతోనే బయట అడుగు పెట్టాలని అంటున్నారు. సో రియోకు వెళ్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.