అనిల్ కుంబ్లే రాజీనామా: కోహ్లీకి బింద్రా చురకలు...కోచ్ నచ్చకపోయినా 20 ఏళ్లు?

బుధవారం, 21 జూన్ 2017 (12:31 IST)
టీమిండియాకు ఎన్నో విజయాలను సంపాదించిపెట్టి.. జట్టు ఆటగాళ్లకు మంచి శిక్షణ ఇచ్చిన అనిల్ కుంబ్లేపై టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేసి, లేనిపోని వివాదాలను వెలుగులోకి తెచ్చారు. తమకు కోచ్ అయిన అనిల్ కుంబ్లే నచ్చలేదని ఫిర్యాదు చేసి.. జట్టులో అభిప్రాయభేదాలు ఉన్నాయని బీసీసీఐకి ముట్టించి.. కుంబ్లేనే తన పదవికి తానే రాజీనామా చేసేంత స్థాయికి తీసుకొచ్చిన టీమిండియా ఆటగాళ్లకు ఏస్ షూటర్ అభినవ్ బింద్రా చురకలంటించారు. 
 
జట్టు ఫలితాలు మెరుగ్గా ఉన్నా.. అనిల్ కుంబ్లేను తీసేయడం కుదరదని బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్న వేళ.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా చెత్తగా ఆడిందని.. అందుకు బాధ్యత వహిస్తూ కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో టీమిండియాతో కుంబ్లేకున్న సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు షూటింగ్‌లో ఒక ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా వినూత్నంగా స్పందించాడు. 
 
తన ట్విట్టర్ ఖాతాలో కోహ్లీ టీమ్‌కు దిమ్మతిరిగే ట్వీట్‌ చేశాడు. తనకు అతిపెద్ద టీచర్ తన కోచ్ ఉవే. అతనిని తానెంతో ద్వేషించాను. అయినప్పటికీ అతనితో 20 సంవత్సరాలు కలిసి నడిచాను. తనకు నచ్చకపోయినా.. అతడు తనకు ఇష్టం లేని విషయాలే చెప్పినా.. అతనితో కలిసి నడిచానని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వెబ్దునియా పై చదవండి