రియో ఒలంపిక్స్‌లో ఇండియన్ మహిళా జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ కొత్త చరిత్ర

బుధవారం, 10 ఆగస్టు 2016 (15:50 IST)
భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో భాగంగా ప్రొడునోవా వాల్ట్  విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. 
 
ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్‌లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ, దీపా కర్మాకర్ ఇండియాకో పతకాన్ని తీసుకురావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి