కోవా లడ్డూలు

శుక్రవారం, 23 జనవరి 2009 (19:30 IST)
కావలసిన పదార్థాలు :
శనగపిండి... పావు కేజీ
చక్కెర... అరకేజీ
జీడిపప్పు... ఆరు
పిస్తా పప్పు... నాలుగు
కోవా... అరకేజీ
యాలక్కాయల పొడి... ఒక టీస్పూన్
బాదం పప్పులు... నాలుగు
నెయ్యి లేదా నూనె... అరకేజీ
సిల్వర్ రేపర్... కావాల్సినంత

తయారీ విధానం :
శనగపిండిని జల్లించి, పలుచగా బూందీ పిండిలాగా కలుపుకోవాలి. నెయ్యి లేదా నూనెను వెడల్పాటి బాణలిలో పోసి వేడిచేసి, అందులో బూందీ చట్రం సహాయంతో శనగపిండిని వేసి బూందీని చేసుకోవాలి. పొయ్యిమీద ఒక పాత్రలో మూడొంతుల చక్కెరను, తగినంత నీటిని పోసి పాకం పట్టి, లేత పాకం రాగానే వేయించిన బూందీని అందులో వేసి కలియదిప్పి పక్కన ఉంచుకోవాలి.

మిగిలిన చక్కెరను కోవాలో వేసి పొయ్యిమీద పెట్టాలి. దానిని కలియదిప్పుతూ... యాలక్కాయల పొడి, జీడిపప్పులు, బాదం, పిస్తా ముక్కలు కూడా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి దానిమీద బూందీ, కోవా మిశ్రమాన్ని పరచాలి. కాస్తంత ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి.

అలా మొత్తం చేసుకున్న తరువాత ఒక్కోదానికి సిల్వర్ రేపర్ అతికించి, వేరే పళ్లెంలో ఉంచుకోవాలి. అంతే కోవా లడ్డూలు రెడీ అయినట్లే...! ఎంతో రుచిగా ఉండే ఈ లడ్డూలను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

వెబ్దునియా పై చదవండి