కావలిసిన పదార్థాలు : కొబ్బరి - రెండు కాయలు (అప్పుడే కొట్టినవి), బెల్లం - అర కేజీ, ఏలకులు - పది (పొడి చేసినవి), మైదా పిండి - అరకేజీ, గోధుమ పిండి - అరకేజీ, జీడి పప్పు - 12 (నేతిలో వేయించి ఉంచుకోవాలి), నూనె - పావు కిలో, నెయ్యి - పావు కిలో.
తయారు చేయి విధానం : ముందుగా కొబ్బరిని తురిమి మిక్సీలో వేసి మెత్తగా నూరి ఓ పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టాలి. ఇందులో కోరి పెట్టుకున్న బెల్లం, జీడిపప్పు, నెయ్యిలను వేయాలి. పేస్ట్‌లా తయారయ్యేంత వరకూ బాగా కలపాలి. దీని స్టవ్ మీద నుంచి దించి ఏలకుల పొడిని వేసి కలపాలి. దీనిని చల్లార్చాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
మైదా పిండి, గోధుమ పిండి (గోధుమ పిండి వద్దనుకుంటే మైదా మాత్రమే తీసుకోవచ్చు)లను తీసుకుని ఇందులో ఐదు చెంచాల నూనె, నీళ్లు పోసి బాగా కలిపి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. దీనిపై కాస్త నూనె రాసి పదిహేను నిముషాలు నాననివ్వాలి. దీనిని చిన్న ఉండలుగా చేసి చిల్లు పెట్టి ఇందులో కొబ్బరి ఉండని పెట్టి మూసేసి, పరోటాల్లాగా ఒత్తుకోవాలి.
స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి రాసి కాగాక దీనిపై ఒత్తి పెట్టుకున్న పరోటాలను వేసి రెండు వైపులా వేయించాలి. రెండు వైపులా నెయ్యి రాస్తూ బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి పొడి పాత్రలో పెట్టి నెయ్యితో సర్వ్ చేయాలి.