ట్వంటీ20 ప్రపంచకప్: భారత్‌కు బ్రేవో బ్రేక్

ట్వంటీ20 ప్రపంచకప్ సూపర్‌-8లో భాగంగా భారత్‌కు వెస్టీండీస్ షాకిచ్చింది. బ్రేవో తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో భారత విజయావకాశాలకు గండికొట్టాడు. దీంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం చవిచూసింది. భారత టాప్‌ ఆర్డర్‌కు ఎడ్వర్డ్స్ (3/24), బ్రేవో(4/38)లు చెక్ చెప్పగా అనంతరం బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోవడం ద్వారా బ్రేవో విండీస్‌కు విజయాన్ని అందించాడు.

ఈ మ్యచ్‌లో భాగంగా వెస్టీండీస్ బౌలింగ్ మెరుపులకు భారత్ కేవలం 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా యువరాజ్ తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. యువరాజ్‌కు యూసుఫ్‌ పఠాన్‌ తోడు కావడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది.

అనంతరం 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 18.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి విజయం సాధించింది. జోరుమీదున్న గేల్‌(22)ను భారత్ నిలువరించినా అటుపై క్రీజులోకి వచ్చిన బ్రేవో(66 నాటౌట్‌), సిమండ్స్‌(44)లు విండీస్‌ విజయాన్ని ఖాయం చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించింది. అయితే భారత్ జోరుకు బ్రేక్ వేసే విధంగా విండీస్ తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రారంభించింది. ఫలితంగా రెండో ఓవర్‌ రెండో బంతికే రోహిత్‌ ఔటయ్యాడు. తర్వాత రైనా(5)ను ఎడ్వర్డ్స్ పెవిలియన్‌ చేర్చాడు. ఇలా 27 పరుగులకే ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన భారత్‌ మరో 2 పరుగుల వ్యవధిలో గంభీర్‌ వికెట్‌ను సైతం కోల్పోయింది. అటుపై ధోనీ (11) వికెట్‌ను సైతం భారత్ కోల్పోయింది.

ఈ దశలో వచ్చిన యూసుఫ్‌ పఠాన్‌ అండతో యువరాజ్‌ పరుగుల వేగం పెంచాడు. 37బంతుల్లో యువీ అర్ధసెంచరీ పూర్తి చేయగా, యూసుఫ్‌ సైతం వేగంగానే పరుగులు సాధించాడు. అయితే యువీ (67) జోరుకు మళ్లీ ఎడ్వర్డ్స్ బ్రేక్ వేశాడు. అనంతరం వచ్చిన ఇర్ఫాన్‌(2)తో పాటు, యూసుఫ్‌ పఠాన్‌ను బ్రేవో పెవిలియన్‌ చేర్చాడు. చివరకు హర్భజన్‌ (13) మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు సాధించింది.

వెబ్దునియా పై చదవండి