ఠాణాలో అమానుషం - కాళ్లకు సంకెళ్లు వేసి చీపురుతో ఊడ్పించిన పోలీసులు...

ఠాగూర్

మంగళవారం, 11 మార్చి 2025 (13:10 IST)
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో అమానుష చర్య ఒకటి వెలుగుచూసింది. ఓ కేసు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న నిందితుడు కాళ్ళకు సంకెళ్లు వేసి చీపురుతో పోలీస్ స్టేషన్‌ను ఊడ్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి కాళ్ళకు సంకెళ్లతో కనిపించాడు. సాధారణంగా కరుడుగట్టిన నేరస్థులకు మాత్రమే ఇలా సంకెళ్లు వేస్తారు. అయితే, ఒక నిందితుడుని స్టేషన్‌కు పిలిపిస్తే సెల్‍‌లో ఉంచి తాళం వేస్తారు. కానీ, బోధన్ పోలీసులు మాత్రం ఓ పెద్ద చైన్‌ను నిందితుడు కాళ్లకు బిగించి, అతడితో స్టేషన్‌లో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. స్టేషన్‌ను క్లీన్ చేయాలని చెప్పడంతో చీపురు పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తూ సదరు నిందితుడు ఠాణాను ఊడ్చడం వీడియోలో కనిపిస్తుంది. 
 
గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న చిన్న కేసుల్లో అరెస్టు అయిన వారిని ఇలా వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళ్లకు సంకెళ్లు వేసి మరీ పనిచేయించుకోవడం అమానుష చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు