తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కర్నాటక రాష్ట్రంలోని బెలగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో జనగణనలో కులగణన కూడా చేయాలన్న తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ ప్రతిపాదన చేయగా, దానికి ఆమోదం తెలిపింది.
సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని, జనాభా ప్రాతిపదికన జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తగ్గుదల ఉంటుందన్నారు. అప్పుడు దక్షిణాది నష్టపోయే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ విషయంపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచన చేయాలన్నారు.
నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. చట్టసభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చామని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలన్నారు. మహిళా బిల్లుతో బీజేపీ తమకు అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని, ఈ విషయంలో పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
తెలంగాణలోని కులగణన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. వచ్చే ఏడాది కేంద్రం చేయనున్న జనగణనలో కులగణన కూడా ఉండాలని, ఈ దిశగా కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా సీడబ్ల్యూసీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు.