భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

ఐవీఆర్

బుధవారం, 14 మే 2025 (16:20 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టిబి) రోగులకు సాయం చేసేందుకు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, టిబి రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది. ప్రతి పోషకాహార కిట్‌లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె, వేరుశనగలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి.
 
ఈ కార్యక్రమం 2025 నాటికి టిబిని నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ కార్యక్రమమైన ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌లో భాగం. భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద నిక్షయ్ మిత్రగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నమోదు చేయబడింది. ఈ ప్రాజెక్ట్, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ మద్దతుతో నిర్వహించబడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధి భారాన్ని భారతదేశం భరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి బాధితులలో దాదాపు 27% ఇక్కడ వున్నారు. గ్లోబల్ టిబి రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం, 2022లో భారతదేశంలో 2.82 మిలియన్ల కొత్త టిబి కేసులు నమోదయ్యాయి, దాదాపు 331,000 మరణాలు ఈ వ్యాధి కారణంగా సంభవించాయని అంచనా.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది, దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ శ్రీ జితేష్ వి పాటిల్, ఐఏఎస్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా చిగురుపాటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఉమా చిగురుపాటి మాట్లాడుతూ, "గ్రాన్యూల్స్‌ వద్ద, మంచి ఆరోగ్యమనేది కేవలం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, సంపన్నమైన, ఉత్పాదక సమాజానికి పునాది అని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా, టిబి రోగులకు అవసరమైన పోష్టికాహార మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము, ఈ వ్యాధి బారి నుంచి కోలుకునే ప్రయాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌కు తోడ్పడటం, 2025 నాటికి భారతదేశంలో టిబిని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో మా వంతు పాత్ర పోషిస్తుండటం గర్వకారణంగా వుంది" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు