హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా పడుతున్నారు. ఈ క్రమంలోనే భారాస జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధన్ రెడ్డి (పీజేపీ) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించింది.
ఇప్పటికే ఆ పార్టీ తరపున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితోనూ భారాస నేతలు నామినేషన్లు వేయించారు.
మరోవైపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపైనర్లతో ఆ పార్టీ లిస్ట్ విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.