రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ.. నేడు దర్శకుడు క్రిష్ వద్ద విచారణ

వరుణ్

గురువారం, 29 ఫిబ్రవరి 2024 (10:17 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి టాలీవుడ్ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ వద్ద హైదరాబాద్ పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. ఈ డ్రగ్స్ పార్టీకి క్రిష్ హాజరైనట్టు దర్యాప్తులో వెలుగులోకి రావడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలవగా శుక్రవారం హాజరవుతానని ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
ఈ కేసులో పలు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారి ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా కొంతమంది వివరాలు సేకరించినట్టు సమాచారం. ప్రధాన నిందితుడైన గజ్జల వివేకానంద్‌‍కు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
 
బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్ రకరకాల మార్గాల్లో కొకైనన్‌ను తెచ్చి డ్రైవర్ ప్రవీణ్‌కు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్.. వివేకానంద్‌కు ఇచ్చేవాడు. ప్రవీణ్, అబ్బాస్‌ల మధ్య నగదు లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ ఇంకా దొరకలేదు.
 
వివేకానంద్ వారాంతాల్లో హోటల్‌కు వచ్చేవాడని, తన స్నేహితులతో పార్టీలు నిర్వహించేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే, విచారణలో పోలీసులకు పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. రాడిసన్ హోటల్లో మొత్తం 200 కెమెరాలు ఉండగా, 20 మాత్రమే పనిచేస్తున్నట్టు తెలిసింది. 
 
వివేకానంద్ పార్టీలకు అతడి స్నేహితులు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరెవరు వస్తున్నారనే తెలుసుకునే క్రమంలో సీసీకెమెరాలు పనిచేయకపోవడం సవాలుగా మారింది. పార్టీలు జరిగినట్టుగా భావిస్తున్న గదుల సమీపంలోని కెమెరాలు కూడా పనిచేయలేదని తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు