బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన వివాదాలు ఎన్నో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటి ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కొందరు పాపులర్ యూట్యూబర్లు అదే పనిగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. వీటి మాయలో పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. దానిపై ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. డబ్బులు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలున్నాయని బెట్టింగ్ యాప్స్‌పై ఫైర్ అయ్యారు.
ఇలాంటి దిక్కులు మాలిన పనులు చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ టాలెంట్‌ను చాలా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ఇలాంటి పనుల వల్ల ఎంతోమంది బెట్టింగ్‌కు బానిసలవుతారని.. మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి అని వార్నింగ్ ఇచ్చారు.
ఆన్‌లైన్ వేదికగా జరిగే బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారంటూ, బెట్టింగ్‌కు బానిసై భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అంటూ సందేశాన్ని ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సజ్జనార్ ఇచ్చిన వార్నింగ్‌తో యూట్యూబర్ నాని స్పందించారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఇకపై ప్రమోట్ చేయనని య్యూటూబర్ నాని ప్రకటించారు. ఇందుకు సజ్జనార్ అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
మిగతా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు కూడా నాని లాగే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇకపై ఇతర వ్యక్తులు కూడా బెట్టింగ్ యాప్‌లకు ప్రమోట్ చేయవద్దని కోరారు. అయితే ఎవరెంత చెప్పినా తమ ఇష్టానుసారం వుంటామని అనుకుంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.