హైదరాబాద్ నగరంలోని కంచి గచ్చిబౌలిలో అభయారణ్యంలోని చెట్లను ముందస్తు అనుమతులు లేకుండా నరికినట్టు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి సారథ్యంలోని ధర్మాసనం పై విధంగా స్పందించింది.
కంచి గచ్చిబౌలి అభయారణ్యంలోని చెట్లను కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేది తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.