ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇప్పుడున్న 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు ముగుస్తాయి. కాబట్టి మద్యం షాపుల వేలం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఇందుకోసం ప్రభుత్వంలోని ఎక్సైజ్ విభాగం... కొత్త మద్యం పాలసీని సెప్టెంబర్ చివరి నాటికి తేవాలని చూస్తోంది.
ఇందులో భాగంగానే... అదనంగా మరో 200 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే, కొత్తగా నిర్మించిన 80 బార్లకు ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా... రకరకాల కారణాలతో అవి ప్రారంభం కాలేదు. లిక్కర్ షాపులకు ఆ పరిస్థితి రాకపోవచ్చు.
కొత్త షాపులను కొత్త మండలాలు, మున్సిపాలిటీలు, కొత్త ఏరియాల్లో ఓపెన్ చెయ్యాలన్నది అధికారుల ప్రతిపాదన. ఎక్కడైతే తరచూ మేళాలు, వేడుకలు, పండుగలు, ఫంక్షన్లు, కార్యక్రమాల వంటివి తరచూ జరుగుతూ ఉంటాయో.. అలాంటి చోట కొత్త లిక్కర్ షాపులను తెరవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ పెంచుకునేందుకు ఈసారి లిక్కర్ షాపుల వేలం లైసెన్స్ ఫీజును కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అదనంగా రూ.1,200 కోట్ల రెవెన్యూ రాబట్టాలనే టార్గెట్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ నుంచి సంవత్సరానికి రూ.9,000 కోట్ల ఆదాయం వస్తోంది.