లాక్‌డౌన్ ఎఫెక్ట్ : తాగుబోతుల వింతప్రవర్తనలు.. ఆత్మహత్యలు.. ఎక్కడ?

ఆదివారం, 29 మార్చి 2020 (09:12 IST)
కరోనా వైరస్ మహమ్మారిని ప్రజలను కాపాడుకునేందుకు, ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ, పటిష్టంగా అమలు చేస్తున్నాయి. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా ఇతరుల కంటే.. మద్యంబాబుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మద్యానికి బానిసలుగా ఉన్నవారు ఇపుడు తాగేందుకు మద్యం లేకి వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. దీంతో నిత్యమూ కల్లు, మందుకు అలవాటు పడిన వారు, ఇప్పుడు అవి దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఇందూరులో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా, నిజామాబాద్‌‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
అలాగే, నగరంలోని సాయినగర్‌‌కు చెందిన శకుంతల (65)కు నిత్యమూ కల్లు తాగడం అలవాటు. గత వారం రోజులుగా కల్లు అందుబాటులో లేకపోగా, రెండు రోజుల నుంచి పిచ్చిగా ప్రవర్తించిన ఆమె, శుక్రవారం రాత్రి ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్‌ తాగేసింది. దీన్ని గమనించిన ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది. 
 
ఇదేసమయంలో మద్యం తాగే అలవాటున్న శంకర్‌ (45) అనే వ్యక్తి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి ముదిరాజ్‌ వీధిలో ఉండే భూషణ్‌ అనే మరో వ్యక్తి, కల్లు లేక విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఫిట్స్‌ వచ్చి చనిపోయారని పేర్కొన్నారు.
 
కాగా, తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి బానిసలు అయినవారు లక్షల్లో ఉన్నారు. వీరికి మరికొన్ని రోజులు మద్యం అందుబాటులో లేకుంటే, ఈ తరహా మరణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు