ప్రాణాలు తీసిన జొన్నరొట్టె ... ఐదుగురు తిన్నారు .. ముగ్గురు చనిపోయారు!!

బుధవారం, 23 డిశెంబరు 2020 (08:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదం జరిగింది. ఓ జొన్నరొట్టె ఏకంగా ముగ్గురి ప్రాణాలు తీసింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ రొట్టె తిన్న మరో ఇద్దరిలో ఒకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పల్వట్లకు చెందిన శంకరమ్మ అనే మహిళ గ్రామంలో భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటోంది. ఈమెకు నలుగురు కుమారులు. పెద్ద కొడుకు చనిపోగా చంద్రమౌళి (55), శ్రీశైలం (50), సంతోష్‌ ఉన్నారు. చంద్రమౌళికి భార్య అనసూయ, పిల్లలు సంధ్య, సాయిబాబా... శ్రీశైలానికి భార్య సరిత, కూతురు శిరీష ఉన్నారు. చంద్రమౌళి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో, శ్రీశైలం, సంతోష్‌ తమ కుటుంబాలతో కలిసి సదాశివపేటలో ఉంటున్నారు. 
 
అయితే, పల్వట్లలో శంకరమ్మ, ఆమె పెద్ద కోడలు సుశీల (60) ఉంటున్నారు. 13న శంకరమ్మ వాంతులు చేసుకొవడంతో ఆమెను కోడలు సుశీల, స్థానికులు జోగిపేటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. పాము కాటుతోనే ఆమె చనిపోయివుంటుందని అందరూ భావించారు. అంత్యక్రియల కోసం ముగ్గురు కుమారులు.. తమ భార్యాపిల్లలతో కలిసి పల్వట్లకు వచ్చారు. 21న (సోమవారం) తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని అనుకున్నారు.
 
సోమవారం మధ్యాహ్నం ఇంట్లో శంకరమ్మ భిక్షాటన చేసి తెచ్చి నిల్వ ఉంచిన జొన్నపిండితో రొట్టెలు చేసుకున్నారు. పిల్లలతో కలిసి సుశీల, చంద్రమౌళి, అనసూయ, శ్రీశైలం, సరిత కూర్చుని భోజనం చేశారు. ఈ ఐదుగురూ రొట్టెలు తినగా.. పిల్లలు సంధ్య, సాయిబాబా, శిరీష.. తమకు రొట్టెలు వద్దంటూ అన్నం తిన్నారు. కొద్దిసేపటికే సుశీల, చంద్రమౌళి, అనసూయ, శ్రీశైలం, సరిత వాంతులు చేసుకున్నారు. 
 
కంగారు పడిన ముగ్గురు పిల్లలు, విషయాన్ని ఊళ్లోవారికి చెప్పడంతో ఐదుగురినీ వారు జోగిపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే సుశీల, చంద్రమౌళి మృతి చెందారు. శ్రీశైలం, ఆయన భార్య సరితను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శ్రీశైలం మృతి చెందాడు. సరిత పరిస్థితి విషమంగా ఉంది. అనసూయ, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
కాగా సంతోష్‌ భార్యాపిల్లలతో కలిసి అంతకుముందురోజే నారాయణఖేడ్‌లోని అత్తగారింటికి వెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది. అయితే శంకరమ్మ కూడా జొన్నరొట్టె తినడంతోనే మృతి చెంది ఉంటుందని ఇప్పుడంతా భావిస్తున్నారు. పిండిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. మృతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే క్రాంతి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు