దుబ్బాకలో కారు పల్టీలు... 12వ రౌండ్‌లో 'తెరాస'కు మూడో స్థానం...

మంగళవారం, 10 నవంబరు 2020 (14:17 IST)
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తెరాసకు షాకు తగిలేలా ఉంది. ఈ ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి 12వ రౌండ్ ముగిసే సమయానికి కారు ప్రయాణం పల్టీలు కొడుతూసాగుతోంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప‌దో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ 456 ఓట్ల‌తో ముందంజ‌లో ఉంది. 
 
తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్ల‌లో బీజేపీ లీడ్‌లో ఉండ‌గా, 6, 7, 10 రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 6, 7, 10 రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ 353, 182, 456 ఓట్ల మెజార్టీ సాధించింది. 11వ‌ రౌండ్‌లో బీజేపీ 199 ఓట్ల ముందంజ‌లో ఉంది. దౌల్తాబాద్‌‌, చేగుంట‌, రాయ‌పూర్ మండ‌లాల ఓట్లు లెక్కించాల్సి ఉంది. మొత్తం 23 రౌండ్ల‌లో లెక్కింపు ప్ర‌క్రియ ముగియ‌నుంది. 10 రౌండ్లు పూర్త‌య్యే స‌రికి బీజేపీ ‌34748, టీఆర్ఎస్ 30815, కాంగ్రెస్ పార్టీ 8582 ఓట్లు సాధించింది. 
 
అయితే, రౌండ్ రౌండ్‌కు ఈ ఫలితాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. 11 రౌండ్లుగా వెనుకబడిపోయిన కాంగ్రెస్ పార్టీ 12వ రౌండులో ఎట్టకేలకు ఆధిక్యతను సాధించింది. ఈ రౌండులో అధికార తెరాస పార్టీ మూడో స్థానంలో నిలిచింది. అలాగే, 12వ రౌండులో బీజేపీకి 1,997 ఓట్లు, తెరాసకు 1,900 ఓట్లు పడగా... కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 2,080 ఓట్లు వచ్చాయి. 
 
దీంతో, ఈ రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి 83 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 12వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 36,745 ఓట్టు సాధించగా... తెరాసకు 32,715, కాంగ్రెస్‌కు 10,662 ఓట్లు వచ్చాయి. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో తెరాస ఈ రౌండులో మూడో స్థానానికి పరిమితమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు