కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు ఈసీ షాక్

గురువారం, 24 జూన్ 2021 (09:19 IST)
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్‌.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఆయనపై మూడేళ్లపాటు అనర్హత వేటువేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 
 
దీనిపై బలరాం నాయక్ స్పందించారు. గత ఎన్నికల్లో తాను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశానని.. అప్పట్లో అన్ని రకాల పత్రాలను ఎన్నికల కమిషన్‌కు నివేదించానన్నారు. అయితే, సరైన పత్రాలు నివేదించలేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తనపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేసిందన్నారు. కానీ తన వద్ద అన్ని రకాల పత్రాలు సిద్ధంగా ఉన్నాయని.. నేరుగా ఎన్నికల కమిషన్‌కు కానీ, న్యాయస్థానం ద్వారా కాని తిరిగి పత్రాలను నివేదిస్తానంటూ తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ బలరామ్‌ నాయక్‌ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు