నరకాసురుడిని గురించి గానీ, రాముడి గురించి గానీ, దీపావళి గురించి కానీ అస్సలు మాట్లాడలేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్పష్టం చేశారు. ప్రింట్ మీడియా తనపై తప్పుడు వార్తలను ప్రచురిస్తుందన్నారు. విజయవాడలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఆ సభకు తాను హాజరై తీరుతానని ఉద్ఘాటించారు. తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఐలయ్య మండిపడ్డారు.
ఇప్పటికే ఐలయ్య రాసిన "సామాజిక స్మగర్లు కోమటోళ్లు" పుస్తకాన్ని నిషేధించలేమని, అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో ఐలయ్యకు కొందరు సన్మానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభ కనుక నిర్వహిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఆర్యవైశ్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే ఈ సభకు తాను రాకూడదని పట్టుబడుతున్న ఆర్యవైశ్యులు హెచ్చరించినా వెనక్కి తగ్గనని చెప్పారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందన్నారు.
ముఖ్యంగా టీజీ వెంకటేశ్, పరిపూర్ణానంద లాంటి వారు తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. పత్రికలను పట్టుకొచ్చి తనపై దాడి చేయాలనుకుంటున్నారని ఐలయ్య ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత తాను ఎవ్వరినీ అవమానించలేదని.. తనపై అసత్య ప్రచారం వెనుక ఆర్యవైశ్యులు వున్నారని కంచ ఐలయ్య విమర్శించారు.