తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు బావాబావమరుదులు. ఒకరు సిద్ధిపేటకు ఎమ్మెల్యే అయితే మరొకరు సిరిసిల్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ తమతమ నియోజకవర్గాలను పోటీపడీ అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేటలో ఐటీ టవర్ నిర్మాణం జరిగింది. దీని ప్రారంభోత్సవంలో ఈ మంత్రులిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హరీష్ రావు మా బావ. అందుకే అపుడపుడూ టీజ్ చేస్తుంటాను అని అన్నారు. హరీష్ అభివృద్ధి కామకుడని అన్నారు. తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయంగా చాటుతున్న వ్యక్తి కేటీఆర్ అని హరీష్ రావు అన్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హరీష్ రావు తన బావ కావడంతో సరదాగా ఏడిపిస్తుంటాను. నేను సిరిసిల్లకు సిద్ధపేట మీదుగానే వెళ్ళాలి. ఇక్కడకు రాగానే హరీష్ రావుకు ఫోన్ చేస్తా. ఏం సంగతి బావా.. మళ్లేదో కొత్తవి కట్టినట్టున్నవ్. కొత్త రోడ్లు వేసినవ్ అని అడుగుతా. దీనికి ఆయన స్పందిస్తూ... ఇక లాభం లేదు. మళ్లోసారి వచ్చినపుడు కళ్లుమూసుకుని పో. ప్రతిసారీ ఏదో ఒకటి అంటున్నవ్ అంటూ సరదాగా బదులిస్తారు అని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. ప్రతి ఒక్కరూ అసూయపడేలా సిద్దిపేటన హరీష్ రావు అభివృద్ధి చేశారని, వచ్చే ఎన్నికల్లో లక్షన్నర మెజార్టీతో హరీష్ రావును గెలిపించుకోవాలన్నారు.