బల్దియాలో రికార్డులన్నీ బద్దలు... అత్యవసర సేవల కోసం ఫోన్ నంబర్లు ఇవే...

బుధవారం, 14 అక్టోబరు 2020 (08:49 IST)
రాజధాని నగరం హైదరాబాద్‌ను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాకినాడలో తీరందాటిన ఈ తుఫాను ప్రభావం కారణంగా హైదరాబాద్‌‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, మంగళవారం కురిసిన వర్షం 18 యేళ్ల రికార్డును బద్ధలు కొట్టింది. 
 
2002 సంవత్సరంలో హైదరాబాద్‌ నగరంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అప్పుడు కురిసిన వర్షంతో హుస్సేన్‌ సాగర్‌కు వరదలు వచ్చి పరిసర ప్రాంతాలన్నీ కొట్టుకుపోయాయి. ఆ తర్వాత 2010లో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. ఈనెల 9న జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ మండలంలో 15.1 సెం.మీ. కురిసింది. సరిగ్గా 18 యేళ్ళ తర్వాత ఈ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా మంగళవారం గ్రేటర్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ సర్కిల్‌ హస్తినాపురంలో 28.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
నగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి హుస్సేన్‌సాగర్‌ పూర్తిగా నిండిపోయింది. ఎఫ్‌టీఎల్‌(ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌)ను దాటి తూములగుండా బయటకు నీరు ప్రవహిస్తున్నది. మరోవైపు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సహాయక బృందాలను మరింత అప్రమత్తం చేయడంతోపాటు ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లను విడుదలచేశారు. మరో మూడు రోజులపాటు ఇదేవిధంగా వర్షాలుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
 
ఇదే విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ, మ‌రో రెండు రోజుల‌పాటు హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల‌నుంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని కోరారు. ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో న‌గ‌రంలోని ప‌లు చోట్ల రోడ్ల‌పై చెట్లు ప‌డిపోయాయ‌ని చెప్పారు. ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు వ‌ర‌ద ముంపున‌కు గుర‌య్యాయ‌ని తెలిపారు. 
 
జీహెచ్ఎంసీ అధికారులు, స‌హాయ‌క బృందాల‌తో వ‌ర‌ద స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. శిథిలావ‌స్థ‌కు చేరిన భవ‌నాలు, కొండ‌వాలు ప్రాంతాల‌వారు వెంట‌నే ఖాళీచేయాలని సూచించారు. ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని సూచించారు. ఎలాంటి ఆస‌రా లేనివారికి క‌మ్యూనిటీ హాళ్ల‌లో తాత్కాలిక వ‌స‌తి క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  
 
అంతేకాకుండా, భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రజలు 040-211111111 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. విపత్తు నిర్వహణశాఖ నంబర్‌ 9000113667, చెట్ల తొలగింపు సిబ్బంది నంబర్‌ 6309062583, విద్యుత్ శాఖ నంబర్‌ 9440813750, ఎన్డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 8333068536, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 040-29555500, ఎంసీహెచ్‌ విపత్తు నిర్వహణశాఖ నంబర్‌ 9704601866లకు ఫోన్‌ చేయాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు