ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ గాంధీ దవాఖానాను సందర్శించారు. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.
గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో సీఎం కలియతిరిగారు. బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సీఎం మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం వున్నదన్నారు.
క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి. మీకు ఏ సమస్య వున్నా, అవసరం వున్నా నన్ను సంప్రదించండి. నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను అని సీఎం వారికి భరోసానిచ్చారు.