ప్రాణాలు పోకుండా కాల్చాలని సుపారీ ఇచ్చిన మాజీ మంత్రి కొడుకు...?

సోమవారం, 31 జులై 2017 (14:40 IST)
హైదరాబాద్ నగరంలో మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం పెద్ద కలకలమే రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక విచారణలో ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ముఖ్యంగా.. తనను ప్రాణాలు పోకుండా కాల్చాలని విక్రమ్ గౌడ్ స్వయంగా ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్టు సమాచారం. 
 
దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్పులకు ముందు అనంతపురంకు చెందిన ఓ వ్యక్తితో విక్రమ్ గౌడ్ మాట్లాడి ఉండటం, ఇది ఆత్మహత్యాయత్నం కాదని ఆయన భార్య షిఫాలీ పోలీసులకు స్పష్టంచేసిన నేపథ్యంలో కేసును లోతుగా దర్యాఫ్తు చేపట్టారు. ఈ విచారణలో కొన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లు గుర్తించి పరిశీలించారు. 
 
ముఖ్యంగా విక్రమ్ ఇంటికి సమీపంలోని ఓ సీసీ కెమెరాలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నట్టు రికార్డు కాగా, పోలీసులు దాన్ని పరిశీలించారు. ఆపై విక్రమ్ విచారణలో భాగంగా వెల్లడించిన విషయాలను విశ్లేషిస్తూ వెళ్లిన పోలీసులకు, కాల్పుల ఘటనపై విక్రమ్ వద్దే పూర్తి సమాచారం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. 
 
అయితే, విక్రమ్ గౌడ్ ఆరోగ్యం మెరుగుపడే వరకూ అరెస్ట్ చేసేది లేదని చెబుతూనే, కేసును ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు పెరిగి వాటి నుంచి తప్పించుకునే క్రమంలో, ప్రాణాలు పోకుండా కాల్చాలని తానే స్వయంగా మనషులను కుదుర్చుకున్నాడా? అనే కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి