ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఇద్దరి పేర్లు కూడా ఒకటే కావడంతో ఆసుపత్రి సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఉన్నిసా అనే పేరుతో మహిళలిద్దరూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అందులో ఒకరికి కరోనా పాజిటివ్ కాగా, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందింది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కుటుంబ సభ్యులకు కాకుండా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళ కుటుంబ సభ్యులకు ఉస్మానియా సిబ్బంది, రెయిన్ బజార్ పోలీసులు ఫోన్ చేసి ఆమె చనిపోయినట్టు చెప్పారు.
దీంతో చికిత్స పొందుతున్న ‘‘మా అమ్మ ఎలా చనిపోతుంది’’ అంటూ కుమార్తె నిలదీసింది. ఖంగుతిన్న ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది, రెయిన్ బజార్ పోలీసులు నోరెళ్లబెట్టారు. రెయిన్ బజార్ పోలీసులు మరియు ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని, అలాగే తీవ్ర మానసిక వేదనకు గురిచేశారంటూ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.