తెలంగాణ ప్రాంతానికి చెందిన మెడికో డాక్టర్ ప్రీతి మృతి కేసులో అనేక రకాలైన సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. తమ కుమార్తెను హత్య చేశారంటూ ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే, పోలీసులు మాత్రం కొత్త అంశాన్ని, సందేహాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే అంశంపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ప్రీతి మృతికి ఆత్మహత్య లేదా కార్డియాక్ అరెస్ట్ కావొచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారించే ప్రాథమిక ఆధారాలు మాత్రం లభించలేదు. దీంతో సీపీ ఈ తరహా సందేహాన్ని వ్యక్తం చేసివుండొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది.
అయితే, ప్రీతి ఏ విధంగా చనిపోయిందో తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సివుందన్నారు. అదేసమయంలో ప్రీతిని ఎవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. అయితే, హత్య కోణంలో ఏ విధమైన ప్రాథమిక ఆధారాలు లభించలేదని చెప్పారు. అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రీతి మృతి కేసులోని మిస్టరీ ఎన్నటికీ వీడుతుందో వేచి చూడాల్సిందే.