తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న నాయకుల్లో అత్యంత కీలకమైన, ప్రముఖమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులు. పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పార్టీని నమ్ముకుని ముందుకు వెళుతుంటాడని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. నోటుకు ఓటు కేసులో కీలక వ్యక్తిగా జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తరువాత పార్టీలో తనకు సముచిత స్థానం లేదన్న భావనలో కొన్ని రోజులుగా రేవంత్ ఉన్నారని తెలుస్తోంది.
ఈ కారణంగానే రేవంత్ బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే బిజెపి అధిష్టానంతో ఆయన సంప్రదింపులు కూడా జరిపారట. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసి ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాల వైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాధి రాష్ట్రాల వైపు సత్తా చూపాలన్నదే బిజెపి నేతల ఆలోచన.
మొదటగా తెలంగాణా రాష్ట్రాన్నే బిజెపి నేతలు టార్గెట్ చేశారు. అందుకే స్వయంగా రేవంత్ రెడ్డే ఆ పార్టీలోకి వెళ్ళాలన్న నిర్ణయం కూడా తీసేసుకున్నారట. బిజెపి అతి పెద్ద జాతీయ పార్టీ. అందులోను అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో ఇక కనిపించకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. ఇక వేచి చూసే ధోరణిని పక్కనబెట్టి బిజెపిలోకి వెళ్ళిపోవాలని రేవంత్ నిర్ణయించుకున్నారట.