రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో కళ్ల ముందే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కన్నుమూసింది.. బోసి మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే ఆ ఇంటి ఆనందం ఆవిరై పోయింది. స్కూలుకు వెళుతున్న తన అన్నకు ‘ బై.. బై..’ అంటూ చెప్పిన ఆ చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది. తల్లి చేయి వదిలి ముందుకు వెళ్లడంతో బడి బస్సు ఆద్య బోసి నవ్వును చిదిమేసింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోపిగడ్డలో చోటుచేసుకుంది.
గోపిగడ్డకు చెందిన మోముల చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సాత్విక్ షాబాద్‌లోని మాంటిస్సోరి పాఠశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలానే సోమవారం ఉదయం సాత్విక్‌ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు లావణ్య తమ రెండేళ్ల కుమార్తె ఆద్యను రోడ్డుపైకి వచ్చింది. సాత్విక్‌ను బస్సు ఎక్కించే క్రమంలో ఆద్య చేయిని వదిలి పెట్టింది.
ఈ లోపు ‘అన్నయ్యకు .. బై.. బై..’ అంటూ చిన్నారి ముందుకు వెళ్లింది. డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి చక్రాల కింద పడిపోయింది. తలపై నుంచి చక్రాలు వెళ్లడంతో ఆద్య అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో షాక్‌కు గురైన లావణ్య ఒక్కసారిగా కుప్పకూలింది. చిన్నారి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, తల్లి లావణ్య ‘ఆద్య.. ఆద్య’ అంటూ విలపిస్తూ గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవరును అదుపులోనికి తీసుకున్నారు.