సికింద్రాబాద్‌లో నాలాలో పడిన ఏడేళ్ళ బాలుడు..

శనివారం, 5 జూన్ 2021 (17:24 IST)
తెలంగాణాలోని సికింద్రాబాద్ నగరంలో విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. స్థానిక బోయినపల్లికు చెందిన ఏడేళ్ళ ఆనంద సాయి అనే బాలుడు చిన్నతోకట్ట నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికులను విషాదంలో ముంచెత్తింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్ బోయినపల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పడిపోయాడు. ఆ సమయంలో మురుగునీటి ప్రవాహం అధికంగా ఉండటంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆనంద్‌సాయి గల్లంతయ్యాడు. 
 
దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు గాలించి.. ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడి మృతిపట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు