నా 40 యేళ్ల రాజకీయ జీవితంలో మోడీ 2 యేళ్ల పాలనే అవినీతి రహిత పాలన : కేసీఆర్

ఆదివారం, 7 ఆగస్టు 2016 (16:21 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతి లేకుండా ఉన్న పాలన మోడీ రెండేళ్ల పాలనే అని చెప్పి కేసీఆర్ అన్నారు. తద్వారా ప్రధాని మోడీ మనసును కేసీఆర్ దోచుకున్నారు. అంతేకాదు తాము ప్రధాని నుంచి, కేంద్రం నుంచి అది కావాలి, ఇది కావాలి అని అడగబోమని, కేవలం మోడీ ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటే చాలన్నారు. 
 
మెదక్ జిల్లా గజ్వేల్‌లో పూర్తి చేసిన మిషన్ భగీరథ తొలి దశ పనులను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ ఓ మహాత్తర కార్యక్రమమని, ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 
 
కృష్ణా, గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించడమే లక్ష్యమని అన్నారు. రూ.8వేల కోట్లతో సింగరేణి పవర్‌ప్లాంట్‌ను నిర్మించామన్నారు. మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్నితిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి రహిత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రెండేళ్లలో చూశానని కేసీఆర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 

కృష్ణా, గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ శుభదినమని చెప్పారు. 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశామని తెలిపారు. రూ. 70 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి