తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతిక చెక్ పెట్టేందుకు ఈ శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరించే గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. దీంతో సెప్టెంబరు ఏడో తేదీ సాయంత్రం ఆరు గంటలతో వీఆర్వోల వ్యవస్థ కనుమరుగైపోయింది.
దీనికి ఆమోదం లభిస్తే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంతా తహసీల్దార్‌లే చూస్తారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ జరిగాక... ఆ భూముల లావాదేవీలు సరైనవా? కాదా? అని నిర్ధారించడానికి వీలుగా నోటీసులు జారీ చేసి, 30 రోజుల గడువు అనంతరం మ్యుటేషన్ చేసేవారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ గడువును వారం రోజులకు కుదిస్తూ ఆర్‌వోఆర్ యాక్ట్‌ను సవరించింది. ఇప్పుడు పూర్తిగా నోటీసుల విధానానికే స్వస్తి పలుకుతూ చట్టాన్ని రూపొందించింది. దీంతో ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే చాలు.. రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు చేరనుంది. మ్యుటేషన్ కాగానే ఆ డేటా పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణా కేంద్రానికి చేరుతుంది. ఆ తర్వాత వారం రోజుల్లో పాస్‌పుస్తకం నేరుగా భూముల యాజమాని/రైతు ఇంటికే వస్తుంది.