తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడటం మొదలెడితే తనదైన స్టయిల్లో పంచ్ డైలాగులు కొడుతూ జనంలో కిక్కెస్తారు. తాజాగా ఆయన తెలంగాణలో ఓ సభలో మాట్లాడుతూ... ఐటీ మంత్రి కేటీఆర్ పైన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలిస్తామని చెప్పిన కేసీఆర్ దగా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కష్టపడినివారికి పదవులివ్వకుండా చివర్లో వచ్చినవారిని మంత్రులు చేశారంటూ విమర్శించారు. కళ్లు మూసుకున్న కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటూ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను కూడా ఆంధ్రోళ్లకు డైవర్ట్ చేస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రం ఐటీఐఆర్ పెద్ద ప్రాజెక్టును 50 వేల కోట్ల మేర కేటాయిస్తే ఆ ప్రాజెక్టుకు సీఈఓగా లండన్ శ్రీనివాస్ అనే కృష్ణజిల్లా ఆంధ్రుడిని కేటీఆర్ నియమించారన్నారు. ఆయన కేటీఆర్ మిత్రుడే కాకుండా మోహన్ బాబు మొదటి అల్లుడు అని కూడా వ్యాఖ్యానించారు. ఇలా పెద్దపెద్ద ప్రాజెక్టులను ఆంధ్రోళ్లకే ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తోందంటూ నిలదీశారు.