బిడ్డా.. ఇది నా అడ్డా... అక్కడకు వెళ్లి ఓడించి వచ్చా.. ఇక్కేడం చేస్తారు : హరీష్ రావు

ఆదివారం, 1 నవంబరు 2020 (09:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. పైగా ఈ బై పోల్‌ను అధికార తెరాస, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 
 
ఈ క్రమంలో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత తరపున మంత్రి హరీశ్ రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా బదులిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. 
 
తాజాగా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడెక్కడి లీడర్లో వచ్చి దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలయ్యాక వాళ్లెవరైనా ఇక్కడ ఉంటారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ పోయి ఓడించానని, దుబ్బాక తన అడ్డా అని, ఇక్కడకు ఎవరొచ్చి ఏంచేయగలరని వ్యాఖ్యానించారు.
 
అభివృద్ధిని కళ్లుండీ చూడలేని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అంటూ విమర్శించారు. సీసాలు, పైసలు, అవాస్తవాలనే నమ్ముకున్నారని, బీజేపీకి పరాయి నేతలు, కిరాయి మనుషులే దిక్కయ్యారని అన్నారు. 
 
మరోవైపు, దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చార‌ప‌ర్వం చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు పార్టీల ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈనెల 3న ఉపఎన్నిక పోలింగ్ జ‌రుగ‌నుంది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతితో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. 
 
దీంతో అన్ని పార్టీలు గెలుపే ల‌క్ష్యంగా రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున దివంగ‌త రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు బాధ్య‌త‌ను మంత్రి హ‌రీశ్‌రావు త‌న భుజాన‌వేసుకున్నారు. 
 
ఈనెల 3న పోలీంగ్ ఉండ‌టంతో ఏర్పాట్ల‌పై అధియార యంత్రాంగం నిమ‌గ్న‌మైంది. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట‌ జిల్లాలో నెల‌రోజుల‌పాటు పోలీస్ యాక్ట్‌-1861ను అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌చారం ముగియ‌గానే స్థానికేత‌రులు వెన‌క్కి వెళ్లిపోవాల‌ని ఆదేశాలు జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు