తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వలసలజోరు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన నేతలు ఒక్కొక్కరుగా అధికారపక్షం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఇపుడు మాజీ మంత్రి, టీడీపీ నేత ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డిలు టీడీపీలో చేరనున్నారు. ఇందుకోసం వారు బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయై తమకు స్థానం కల్పించాలని కోరారు. ప్రభుత్వ విధానాలు, పరిపాలనతీరు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొన్నట్టు తమ మనోగతాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు.
సీనియర్ మహిళా నేతగా ఉన్న ఉమా మాధవరెడ్డి రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని నిర్ణయించుకోవటం సంతోషకరమని సీఎం కేసీఆర్ అన్నారు. వీరిద్దరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, నల్గొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, ఉమా మాధవరెడ్డి తెరాస గూటికి చేరనుండంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖాళీకానుంది. రాష్ట్రస్థాయిలోనూ ఈ పరిణామం టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినందున ఆమెకు ముఖ్యనేతలతో సంబంధాలున్నాయి. మరికొంతమంది నాయకులు ఉమ బాటలో నడవటానికి మార్గం ఏర్పడినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమామాధవరెడ్డిలాంటి సీనియర్ నేతలు టీడీపీని వీడుతుండటంతో ముఖ్యనాయకులు కూడా ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఉమామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మరింత బలోపేతం కానుంది.