ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని తానే గ‌ద్దెనెక్కిన వ్యక్తి కేసీఆర్: వైయస్ షర్మిల

మంగళవారం, 10 ఆగస్టు 2021 (21:19 IST)
తెలంగాణలో వైయ‌స్ఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌లు సుభిక్షంగా ఉన్నారని వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమ‌తి వైయ‌స్ ష‌ర్మిల అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైత‌న్న అప్పుల పాలు కావొద్ద‌ని రుణ‌మాఫీ చేసిన ఘ‌న‌త వైయ‌స్ఆర్ గారిదే. రైతుల‌కు ఉచిత విద్యుత్ అవ‌స‌రం అని మొట్ట‌మొద‌ట ఆలోచ‌న చేసిందే వైయ‌స్ఆర్ గారు. పేదింటి పిల్ల‌లు చ‌దువుకోక‌పోతే పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు రాలేర‌ని ఆలోచించి, ఉచిత విద్య‌తో పాటు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.
 
వైయ‌స్ఆర్ హ‌యాంలో పేద‌లు ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లు అయ్యారు. పేద‌లకు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో ఉచిత వైద్యం అందించాల‌నే ఉద్దేశంతో ఆరోగ్య శ్రీని ప్ర‌వేశ‌పెట్టారు. దీనివ‌ల్ల ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొందారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న ఐదేండ్ల‌లోనే దేశంలో ఎక్క‌డా లేని విధంగా 46 ల‌క్ష‌ల ఇండ్లు క‌ట్టించి ఇచ్చారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు, ప‌న్నులు పెంచ‌కుండా, ప్ర‌జ‌ల‌పై భారం మోప‌కుండా అద్భుత పాల‌న అందించారు.

వైయ‌స్ఆర్ గారు నిరుద్యోగ స‌మ‌స్య తీర్చేందుకు మూడు సార్లు డీఎస్సీ వేసి, ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. ప్ర‌భుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కార్పొరేష‌న్ లోన్లు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డేలా చేశారు. కానీ కేసీఆర్ పాల‌న‌లో రైతులు, నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.

ఎవ‌రు ఆత్మ‌హ‌త్యలు చేసుకున్నా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. కేసీఆర్ నిర్ల‌క్ష్యం మూలంగా నిరుద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. రాష్ట్రంలో 54ల‌క్ష‌ల మంది తాము నిరుద్యోగుల‌మంటూ ఏకంగా ప్ర‌భుత్వానికే అప్లికేష‌న్లు పెట్టుకున్నారు. కేసీఆర్ తీరుతో ఏడేండ్ల‌లో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగం అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రాల‌లో మ‌న రాష్ట్రం ఒక‌టి.

కండ్ల ముందు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా క‌నిపిస్తుంటే నోటిఫికేష‌న్లు వేయ‌కుండా జాప్యం చేస్తున్నారు. అమాయ‌క బిడ్డ‌లు నోటిఫికేష‌న్ల కోసం ఎదురు చూసి, నిరుద్యోగంతో స‌మాజంలో త‌లెత్తుకోలేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. వంద‌ల మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా దున్న‌పోతు మీద వాన‌ప‌డ్డ‌ట్టుగా కేసీఆర్‌లో మాత్రం చ‌ల‌నం లేదు. నియామ‌కాల కోసం ఉద్య‌మ స‌మ‌యంలో 1200 మంది ఆత్మ‌బ‌లిదానం చేసుకుంటే మ‌ళ్లీ అవే నియామకాల కోసం ఇప్పుడు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.

ఏడేండ్లుగా కేసీఆర్ ఏం సాధించారు? ఉద్య‌మ ల‌క్ష్యాలు ఎక్క‌డ పోయాయి? తెలంగాణ సంప‌ద‌ను ఎవ‌రు అనుభ‌విస్తున్నారు? ప్ర‌జ‌లు ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి త‌ప్ప ఎవ‌రికీ మేలు జ‌ర‌గ‌డం లేదు. మ‌హ‌మ్మ‌ద్ ష‌బ్బీర్ ఉద్యోగం లేక రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య  చేసుకుంటే కేసీఆర్ క‌నీసం స్పందించ‌లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని చెప్పి గ‌ద్దెనెక్కిన కేసీఆర్, ఉద్యోగాలు ఇవ్వ‌కుండా, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నారు.

80వేల పుస్త‌కాలు చ‌దివాన‌ని తాను అప‌ర‌మేధావిన‌ని చెప్పుకునే కేసీఆర్‌కు నిరుద్యోగుల గోస మాత్రం ప‌ట్ట‌డం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌జ‌ల కోసం రావ‌డం లేదు. ప‌గ‌లు, ప్ర‌తీకారాల కోసం, బ‌లాబ‌లాలు నిరూపించుకోవ‌డానికి వ‌స్తున్నాయి. ఇది ఎంత సిగ్గుచేటు? ప్ర‌జాస్వామ్యంలో ఇందుకోస‌మేనా ఉప ఎన్నిక రావాల్సింది? ఓట్లు అడ‌గ‌డానికి వ‌స్తున్న‌ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు నిల‌దీయాలి. ఏడేండ్ల‌లో ఏడు వేల మంది రైతులు, వంద‌ల మంది నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.

క‌రోనాతో పేద‌లు అల్లాడిపోతుంటే, వేల మంది చ‌నిపోతుంటే క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చాల‌న్న ఇంగిత జ్ఞానం కేసీఆర్ కు లేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడ‌గడానికి వ‌స్తున్నార‌ని టీఆర్ఎస్ లీడ‌ర్ల‌ను ప్ర‌జ‌లు నిల‌దీయాలి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పిన బీజేపీని కూడా నిల‌దీయాలి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకుంటే ఈ రోజు మ‌న బిడ్డ‌లు చనిపోయేవారు కాదు. ప్ర‌తిప‌క్షంగా ఉండి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల కోసం పోరాటం చేయ‌లేదు.

కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న లావాదేవీలు ఏంటో ప్ర‌జ‌లు అడ‌గాలి. ఎప్పుడు మంచి రేటు ప‌లుకుతుందా? ఎప్పుడు అమ్ముడుపోదామ‌ని అని ఎదురు చేసే కాంగ్రెస్ లీడ‌ర్ల‌ను ప్ర‌శ్నించాలి. ఏ ఒక్క పార్టీ మీ ఓటు అర్హులు కాదు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌జ‌ల్ని మోసం చేశాయి. ఉప ఎన్నిక వ‌చ్చింది కాబ‌ట్టే ద‌ళితుల‌కు రూ.10ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెబుతున్నాడు. ఎన్నిక‌లు వ‌చ్చాయి కాబ‌ట్టే ద‌ళితులు ముఖ్య‌మంత్రికి బంధువుల‌య్యారు.

నిస్సిగ్గుగా ఒక ముఖ్య‌మంత్రి ఎన్నిక‌లు ఉన్నాయ‌నే ద‌ళిత బంధు పెట్టామ‌ని చెప్ప‌డం సిగ్గు చేటు. ప‌థ‌కాలు రావాలంటే ఉపఎన్నిక రావాల్సిన ప‌రిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి. ద‌ళితుల మీద ప్రేమ ఉన్న‌ట్లు న‌టిస్తున్న కేసీఆర్.. ఉద్య‌మ స‌మ‌యం నుంచే ద‌ళితుల్ని మోసం చేస్తున్నాడు.

ద‌ళితున్ని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని తానే గ‌ద్దెనెక్కాడు. ద‌ళిత ఉప ముఖ్య‌మంత్రిని తొల‌గించి ద‌గా చేశాడు. మూడెక‌రాల భూమి, డ‌బుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను దారి మ‌ళ్లించాడు. ద‌ళితుల భూముల్ని లాక్కున్నాడు. ద‌ళితుల‌పై దాడులు చేయించాడు. నేరేళ్ల ద‌ళితుల‌ను జైలులో పెట్టి కొట్టించాడు. ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని ద‌ళితుల‌కు ఇస్తున్న రూ.10ల‌క్ష‌లు ప్ర‌తి ద‌ళిత కుటుంబం తీసుకోవాలి.

కానీ మీకు రావాల్సిన‌వి రూ.51ల‌క్ష‌లు అని కేసీఆర్ ను నిల‌దీయండి. ఏడేండ్ల కింద మూడెక‌రాల భూమిని ఇచ్చి ఉంటే ద‌ళితులు రూ.51ల‌క్ష‌లు ల‌బ్ధి పొందేవారు. కానీ కేసీఆర్ అవ‌న్నీ చేయ‌కుండా రూ.10ల‌క్ష‌లు ఇస్తున్నాడు. మిగ‌తా రూ.41ల‌క్ష‌ల‌ను కూడా ముక్క‌పిండి వ‌సూలు చేయాలి. రాష్ట్రంలోని ద‌ళితులంతా హుజూరాబాద్‌లో ఓటు న‌మోదు చేసుకోండి. కేసీఆర్ ఇచ్చే రూ.10లక్ష‌లు ప్ర‌తి ద‌ళిత కుటుంబం తీసుకోండి. ఫీజు రీయింబ‌ర్స్ కూడా చెల్లించ‌ని అస‌స‌మ‌ర్థ ప్ర‌భుత్వం కేసీఆర్ ది. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కేసీఆర్ చేసింది ఏమీ లేదు.

కేసీఆర్ ఇచ్చింది అవ‌మానాలు, ఆత్మ‌హ‌త్య‌లు. అన్యాయంగా రాష్ట్రంలోని 7,561 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించారు. వారిలో వెయ్యి మంది హుజూరాబాద్‌లో పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు. వారికి మా మ‌ద్ద‌తు ఉంటుంది. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న నేత‌న్న భార్య‌లు కూడా హుజూరాబాద్‌లో పోటీ చేస్తామంటున్నారు. వారికి కూడా మా మ‌ద్ద‌తు ఉంటుంది. నిరుద్యోగులు కూడా హుజూరాబాద్‌లో పోటీ చేయాలి.

కేసీఆర్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలి. నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్దు.. మీకు ఉద్యోగాలు వ‌చ్చేంత వ‌ర‌కు మేం పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ల‌క్షా 91వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసి, 54ల‌క్ష‌ల నిరుద్యోగుల‌కు స్కిల్‌ డెవ‌ల‌ప్ మెంట్ ద్వారా శిక్ష‌ణ ఇప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక నిరుద్యోగుల‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేష‌న్ లోన్లు ఇవ్వాలి. అర్హుల‌కు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కేసీఆర్ రాజీనామా చేసి, ద‌ళితున్ని ముఖ్య‌మంత్రి చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు