వెండితెరపై రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్నారు. 'ఖైదీ నంబర్ 150', 'సైరా నరసింహా రెడ్డి'ల తర్వాత ఆయన వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. అదీ కూడా సూపర్ డైరెక్టర్లతో. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తికాకముందే లూసిఫర్ రీమేక్‌లో నటించేందుకు సమ్మతం తెలిపారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడుతో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
అయితే, చిరంజీవికి హీరోయిన్ల సమస్య ఉత్పన్నమవుతోంది. గతంలో ఆయనతో నటించేందుకు హీరోయిన్లు క్యూ కట్టేవారు. కానీ, ఇపుడు చిరంజీవి పక్కన నటించేందుకు హీరోయిన్లు పెద్ద ఆసక్తి చూపడం లేదు. పైగా, కుర్రకారు హీరోయిన్ల జోలికి చిరంజీవి వెళ్లడం లేదు. దీంతో నయనతార, అనుష్క, కాజల్, త్రిష వంటి వారినే ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందులోభాగంగానే 'ఆచార్య' చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. అదీ కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తేనే ఈ అమ్మడు ఓకే చెప్పిందట. నిజానికి ఆమె కంటే ముందుగా త్రిషను ఎంపిక చేశారు. కానీ ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్‌ను సెలెక్ట్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత 'ఆచార్య' యూనిట్‌తో కాజల్ జాయిన్ అవనుంది.
ఇకపోతే, చిరంజీవి నటించే మరో చిత్రం "లూసిఫర్". ఇందులో కూడా హీరోయిన్ కోసం గాలిస్తున్నారు. నిజానికి మలయాళంలో మోహన్‌లాల్ పాత్రకు హీరోయిన్ ఉండదు. కానీ చిరంజీవి ఇమేజ్, ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెలుగులో హీరోయిన్ ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నారట.
ఈ చిత్రాన్ని 'సాహో' దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. మరో నాలుగైదు రోజుల్లో సుజిత్‌తో చిరంజీవి వీడియో కాల్‌లో స్క్రిప్ట్‌కు సంబంధించిన చర్చ జరుపుతారట. కాగా, ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్‌తో పాటు.. యువీ క్రియేషన్స్ కలిసి నిర్మించనున్నాయి.