తాజ్ డివైడెడ్ బై బ్లడ్’లో అనార్కలిగా నటించటం చాలెంజింగ్‌గానూ అనిపించింది: అదితిరావు హైదరి
శనివారం, 18 మార్చి 2023 (15:41 IST)
Aditi Rao Hydari
నాకు బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా చర్చ మీద నమ్మకం లేదు. నేను తమిళ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాను. నా మనసులో అసలు భేదభావాలేం లేవు. మనం మన జనాల కోసం సినిమాలు చేస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నందుకు మనం గర్వపడాలి. మన సంస్కృతులు, భాషలు, రకరకాల ప్రతిభలను చూసి మురిసిపోవాలి. దక్షిణాదిన కూడా నాలుగు భారీ సినిమా ఇండస్ట్రీలున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అదితిరావు హైదరి అన్నారు.
ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ తాజ్ డివైడెడ్ బై బ్లడ్.ఈ సిరీస్‌ను కాంటిలో పిక్చర్స్ రూపొందించింది. ఇందులో స్టార్ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రధాన పాత్రలో నటించింది. ఇంకా సీనియర్ నటులు ధర్మేంద్ర, నసీరుద్దీన్ షా, రాహుల్ బోస్, జరీనా వహాబ్, సంధ్య మృదుల, ఆసిం గులాటి, తాహా షా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అభిమన్యు సింగ్, రూపా సింగ్, విలియమ్ బ్రోత్ విక్ ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మించారు. రాన్ స్కాల్‌పెల్లో, అజయ్ సింగ్, విబు పూరి ఈ షోను డైరెక్ట్ చేశారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి అదితిరావు హైదరి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసారు.
అనార్కలి పాత్ర నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చేయగలనా.. అని ఆలోచించాను. అయితే దర్శకులు నాపై నమ్మకం ఉంచినందుకు చాలాఆనందంగా అనిపించింది. ఆ సమయంలో నేను చేయనని చెబితే వారు ఒప్పుకునేలా లేరు కూడా. మొఘల్ ఈ ఆజామ్ (హిందీ సినిమా)కి భిన్నమైన కోణంలో ఈ సినిమా చెప్పబడుతుందని వారు ఆ సమయంలో చెప్పారు. అయితే కొందరు మధుబాలగారితో నన్ను ప్రేక్షకులు పోల్చి చూసుకుంటారు కాబట్టి ఆలోచించుకో అని చెప్పారు. నిజంగానే అలాంటి పోలికలను ప్రేక్షకులు చూస్తే వాటిని ఆశీర్వాదంగానే చూస్తాను
ఏ పాత్ర అందరూ అనుకున్నంత సులభమైతే కాదు. తెలుగులో నేను నటించిన సమ్మోహనం మూవీలోని పాత్ర కూడా చాలా చాలెంజింగ్‌గా ఉండింది. ఎందుకంటే ఓ నటిగా దర్శకుడు ఏం అనుకుంటున్నారో దాన్ని మనం ప్రెజెంట్ చేయగలగాలి. ఏదో పాత్ర ఉంది కదా చేసేద్దాం అనే కోణంలో కాకుండా దాన్ని మనం పూర్తిగా స్వీకరించి స్క్రీన్ పైన ప్రెజంట్ చేసినప్పుడు ప్రజల హృదయాల్లో చాలా రోజుల పాటు గుర్తుండిపోతాం. నేను నా పనిని ప్రేమిస్తున్నాను. అందుకనే నా పాత్రలు, వాటికి సంబంధించిన పెర్ఫామెన్స్‌ల్లో పూర్తిగా లగ్నమైపోతాను. తాజ్ డివైడెడ్ బై బ్లడ్ సిరీస్‌లో నేను చేసిన అనార్కలి పాత్ర నాకు పూర్తిగా చాలెంజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే అదొక చారిత్రాత్మక పాత్ర. అందులో మనం క్రియేటివిటీతో పాటు మన ఊహత్మకతను కూడా జోడించాల్సి ఉంటుంది.
జీ 5లోని తాజ్ డివైడెడ్ బై బ్లడ్‌లో చూపించిన అనార్కాలి పాత్ర.. అమాయకంగా ఉంటుంది అలాగే నిర్భయంగానూ కనిపిస్తుంది. మరో వైపు మానవతను చూపిస్తుంది. తగినంత స్వేచ్చను తీసుకుని క్రియేటివ్‌గా పాత్రను మలిచారు. ఎవరైనా ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నిస్తే ఆమె వారికి భయంతో దూరంగా వెళ్లిపోతుంది. ఆమె పాత్రలో స్వచ్చత టుంది. అలాగే ఆమె కలలు కంటుంది. నమ్మకాలపై గట్టి అభిప్రాయంతో ఉంటుంది. అలాంటి ఎలిమెంట్స్ అన్నీ అనార్కలి పాత్రను చేయటానికి నన్ను ఎగ్జయిట్ అయ్యేలా చేశాయి.
అనార్కలిని సరికొత్తగా చిత్రీకరించిన విధానం నచ్చింది నాకు. అనార్కలి సుతిమెత్తనైన మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఆమెకు ఆమే అందమైన భూషణం. అందుకే ఆమె చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. నా దృష్టిలో ప్రేమను మించి శక్తివంతమైన అంశం ఇంకోటి ఉండదు. అనార్కలి పాత్రలో నటించడం వల్ల నేను ప్రత్యేకంగా అర్థం చేసుకున్నది అదే. మనసుకు ఏం అనిపిస్తే అది చేసినప్పుడు అసలు భయం ఉండదు. మన కలలను సాకారం చేసుకోదగ్గ స్వేచ్ఛ ఉండటాన్ని మించిన అదృష్టం మరొకటి ఉండదు.
అంజు మోడి నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అవి హెవీగా అనిపించలేదు. ఇంతకు ముందే చెప్పినట్టు అనార్కలి చాలా సున్నితమైన అమ్మాయి. నాజూకైన అమ్మాయి. అందుకే బరువైన కాస్ట్యూమ్స్ వద్దనుకున్నాం. డిజైనర్ కూడా బరువు తక్కువ ఉండే సన్నటి వస్త్రాలను డిజైన్ చేశారు. చాలా బావున్నాయి. జువెలరీ కూడా భారీగా ఉండదు. నేను ధరించిన ప్రతిదీ ఒరిజినల్ జువెలరీనే.
తాజ్‌లో చాలా మంది లెజెండ్స్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. ధర్మేంద్ర సార్‌తో మాత్రం పనిచేయలేకపోయాను. ఆయన నటించిన ఎపిసోడ్స్ అన్నీ మరో కాలానికి సంబంధించినవి కావడంతో నేను అప్పుడు సెట్లో లేను. నసీరుద్దీన్‌షాతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. నా దృష్టిలో గొప్ప నటీనటులందరూ నిగర్వులు. సరదాగా ఉంటారు. చేస్తున్న పనిని ప్రేమిస్తారు. పరిసరాల్లో ఉన్నవారితో బావుంటారు. అందరినీ కంఫర్ట్ జోన్‌లో ఉంచుతారు. అందరినీ ప్రేమగా చూస్తారు. సాయం అడగకపోయినా చేస్తారు. నసీరుద్దీన్ సార్ సెట్లో చిన్న పిల్లాడిలా అందరితో కలిసిపోయారు. ఆయనతో పనిచేయడం ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించింది.
నేను నా పట్ల దయతో ఎప్పుడూ ఉండను. ఎల్లప్పుడూ కఠినంగానే వ్యవమరిస్తుంటాను. స్వీయ విమర్శలు ఎక్కువగా చేసుకుంటుంటాను. ఎప్పటికప్పుడు నన్ను నేను బెటర్‌గా చూసుకోవాలనుకుంటాను. నా నటనను, పనితీరును పరిశీలించుకుంటాను.
నాకు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. సినిమాలను 50, 60 రోజుల్లో పూర్తి చేస్తాం. కానీ వెబ్ సీరీస్‌లకు ఎకకువ సమయం పడుతుంది. సినిమాల్లో టైమ్ పీరియడ్ తక్కువగా ఉంటుంది. నిర్దిష్టంగా ఉంటుంది. కానీ వెబ్‌సీరీస్‌లలో డీటైలింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సమయం ఎక్కువ పడుతుంది. ప్రాజెక్ట్ పట్ల ప్రేమ, ప్యాషన్, మిగిలిన విషయాల్లో సినిమాలకూ, ఓటీటీలకు తేడా ఏం ఉండదు. అందరూ ప్రాణం పెట్టి పనిచేస్తారు.
రీసెంట్ టైమ్స్ లో ఆర్ ఆర్ ఆర్ చూశాను. ఎపిక్ సబ్జెక్ట్. రాజమౌళి సార్‌తో పాటు యూనిట్ అంతా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. మంచి కథల కోసం విదేశాల్లో వెతకకుండా, మన దగ్గర ఉన్న అద్భుతమైన కథలను చెప్పడానికి ప్రయత్నించడం ఆనందం కలిగించింది.
నాకు తెలుగు, తమిళ్ బాగా అర్థమవుతుంది. నాకు మలయాళం అర్థం కాదు. నేను హిందీ బాగా మాట్లాడుతాను. ఉర్దూ కూడా మేనేజ్ చేయగలను. నేను చెప్పాల్సిన లైన్స్ ని కంఠస్థం చేసి చెబుతాను. బోర్డ్ ఎగ్జామ్స్ కి చేసినట్టు.
నటిగా ఇంకా చాలా చేయాలని అనుకుంటాను. మణిరత్నంగారితోనూ, సంజయ్ లీలా భన్సాలీతోనూ రిపీటెడ్‌గా పనిచేసే అవకాశాలు రావడం నా అదృష్టం. నాలో ఇంకా ప్రతిభ ఉందని ఎవరైనా భావిస్తే ఆనందంగా ప్రాజెక్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
నా దృష్టిలో వ్యక్తిగత జీవితమంటే వ్యక్తిగత జీవితమే. అందరినీ అన్నీ వేళల్లో పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి చాలా మంది రాస్తుంటారు. ప్రజలు మాపై చూపించే ఆదరాభిమానాలకు మురిసిపోతుంటాను. సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలని వాళ్లు చూపించే ఆసక్తిని అర్థం చేసుకోగలను.
ఒకవేళ రేఖగారి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే అదొక గొప్ప అవకాశంగా భావిస్తాను.