కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.. తనికెళ్ల భరణిపై పూనమ్ కవిత
గురువారం, 16 ఏప్రియల్ 2020 (13:13 IST)
రచయితగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తనికెళ్ల భరణి ఆ తర్వాత నటుడిగా అవతారం ఎత్తారు. దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించారు. తనికెళ్ల భరణి రచయిత, నటుడు మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక సాహితీ వేత్త కూడా. ప్రస్తుతం అలాంటి వ్యక్తిపై ఓ హీరోయిన్ కవిత రాసింది.
ఆ కవిత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరంటే.. నటి పూనమ్ కౌర్. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నేను రాసిన కవిత అని పూనం కౌర్ పేర్కొన్నారు.
ఔను...
నేను నటుడినే.
కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.
ఔను ...
నేను ఒక కళాకారుడినే.
కానీ, కళామతల్లి మీద ప్రేమ, అభిమానంతో, కళ విలువ తెలియకుండా నా దగ్గరకి వచ్చే ప్రతి మనిషికి నేను నా కళని అమ్ముకోలేకపోయాను.
సాహిత్యం పట్ల ప్రేమతో, మన భారత దేశంలో ఉన్న సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని ఒక చిన్న ఆశ.
ఆ భావంతో, మనసు నిండా అదే ఆలోచనతో నేను నా ప్రతి నాటకం రాశా.
డబ్బు గురించి మాట్లాడితే అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను.
అమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రేమతో, కరుణతో, మర్యాదతో వచ్చినపుడు శిరసు వంచి అందుకున్నాను.
నా దగ్గరకి వచ్చిన మనిషి అహంభావం చూపించినా, నేను ప్రేమతోనే చూశాను.
కానీ, నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం ఏరోజూ అహంతో పంచుకోలేకపోయాను.
వెనకడుగు వేసే ప్రతి నిమిషం కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి.
కానీ నా స్వార్థం కోసం నేను అత్యంత గౌరవాన్ని ఇచ్చే కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.
పూజ చేశాక, మా ఆవిడ నా నుదిటిన పెట్టిన బొట్టుతో నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది.
నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను అని మా ఆవిడ అంటే,
నీ సహాయం లేకుండా ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.