ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవిష్ణు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు
అల్లూరి అంటేనే పవర్ ఫుల్. ఇటివల వచ్చిన అల్లూరి పాన్ ఇండియా విజయం సాధించింది. మీ అల్లూరి ఎలా వుండబోతుంది ?
ఆయన రియల్ అల్లూరి. ఈ అల్లూరి ఆయన నుండి స్ఫూర్తి పొంది చేసిన కథ. కృష్ణ గారి సినిమా అల్లూరి సీతారామారాజు క్లైమాక్స్ లో 'ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారని' చెప్తారు. ఆ వందమందిలో మా అల్లూరి ఒకరు. (నవ్వుతూ). ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి అనే ఫిక్షనల్ పాత్ర తీసుకొని కొన్ని యాధార్ధంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీర్చిదిద్దాం. ఒక పోలీస్ విధిలో చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్ లో ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్ లైన్ ఇందులో చూపించబోతున్నాం.
యాధార్ధ సంఘటనలు అంటున్నారు కదా.. ఈ కథ చేయడానికి ఎంతకాలం రీసెర్చ్ చేశారు ?
దర్శకుడు ప్రదీప్ వర్మ పూర్తి కథతో నా దగ్గరరికి వచ్చారు. ఈ కథలో సంఘటనలు నిజంగా జరిగినవేనని సినిమా చేస్తున్న క్రమంలో ఒకొక్కటిగా తెలిసింది. ఈ కథ విన్నపుడు పోలీస్, వ్యవస్థలో ఇంత డెప్త్ ఉందా అనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలో మంచి చెడులు ఇందులో చూపిస్తాం. చెడుకి పరిష్కారం కూడా చూపిస్తాం.
ఈ కథ చేసినపుడు పోలీసు అధికారులని ఎవరినైనా కలిశారా ?
ఈ సినిమా చేసినప్పుడు కలవలేదు కానీ గత పదిహేను రోజులుగా చేసిన యాత్రలో చాలా మంది పోలీసు అధికారులని కలిశాను. వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాను.
ఈ పాత్ర మీ నిజ జీవితంపై ఎలాంటి మార్పుని తీసుకొచ్చింది ?
నేను చాలా సున్నితంగా మాట్లాడతాను. చాలా విషయాలకి రియాక్ట్ అవ్వను. ఐతే ఈ పాత్ర చేసిన తర్వాత నా చుట్టూ జరిగే కొన్ని విషయాలపై కాస్త వాయిస్ పెంచి మాట్లడుతున్నా.
అల్లు అర్జున్ గారు ప్రీరిలీజ్ ఈవెంట్ మీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు కదా ?
బన్నీగారితో నాకు పదేళ్ళుగా మంచి స్నేహం వుంది. నా సినిమాల మంచి చెడులు చెప్తుంటారు. ఐతే ఎప్పుడూ ఆయన్ని ఏమీ అడగలేదు. ఆయన్నే కాదు సినిమా గురించి ఇండస్ట్రీ లో ఎప్పుడూ ఎవర్నీ ఏమీ అడగలేదు. ఐతే ఈ సినిమాకి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే బన్నీగారిని పిలిచా. ఆయన పిలవగానే వచ్చారు. అలాగే నాని, రవితేజ గారు కూడా మేము అడిగిన వెంటనే మాకు సపోర్ట్ చేశారు.
మీరు బేసిగ్గా మీ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడరు కదా.. కానీ అల్లూరి విషయంలో అదనపు శ్రద్ధ కనబరచడానికి కారణం ? అల్లూరి గురించి చాలా చాలా బలంగా చెప్తున్నారు కదా ?
సినిమా నా మనసుకి నచ్చితే ఖచ్చితంగా బలంగా చెప్తాను. నీది నాదీ ఒకటే కథ, అప్పట్లో ఒకడు, బ్రోచేవారు, రాజరాజ చోర .. ఈ సినిమాలన్నిటికీ చాల బలంగా చెప్పా. పేపర్ మీద చదివిన కథ.. స్క్రీన్ పైకి సరిగ్గా వచ్చి, ఒక తృప్తిని ఇస్తే నాకు చాలా నిజాయితీగా మాటలు వచ్చేస్తాయి. దిని కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వడం వుండదు. నా సినిమా అనే కాదు .. ఏ సినిమా నచ్చిన ఆ టీంతో అలానే మాట్లాడతాను. నా సినిమా కాబట్టి స్టేజ్ పైన మాట్లాడను. అన్ని వర్గాలా ప్రేక్షకులకు రీచ్ అవ్వాల్సిన సినిమా అల్లూరి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఒక స్ఫూర్తిని నింపే సినిమా. కంటెంట్ పై చాలా నమ్మకం వుంది. కమర్షియల్ గా ఉంటూనే డిఫరెంట్ గా వుంటుంది. అందుకే ఇంకాస్త ఎక్కువగా ప్రమోట్ చేయాలనిపించింది.
మీకు ‘ఎఎ’ సెంటిమెంట్ వుందని పప్రిరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా.. దాని గురించి ?
నిజానికి అది ఎక్కడా చెప్పకూడనదని అనుకున్నాను. కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఈవినింగ్ రెండు గంటల నుండి ఎదురుచూశారు. బన్నీగారి ఫ్యాన్స్ రావడంతో ఆ ఈవెంట్ ని నేనే దగ్గరుండి చూశాను. ఫ్యాన్స్ ని చూసిన తర్వాత అది చెప్పాలనిపించింది. నిజానికి ఎఎ సెంటిమెంట్ నాకు బాగా కలిసొచ్చింది. గాలి సంపత్ మినహా మిగతా అన్నీ సినిమాల్లో ఎఎ సెంటిమెంట్ వుంటుంది. ఇక అల్లూరిలో ‘అల్లు’ రావడం ఇంకా హ్యాపీ( నవ్వుతూ).
మీ కంటూ ఒక కఫర్ట్ జోన్ వుంది. మీ కంఫర్ట్ జోన్ లో చేసిన సినిమాలు విజయాలు సాధించాయి. కానీ అల్లూరి కోసం మీ కఫర్ట్ జానే వదిలిరావడానికి కారణం ?
కంఫర్ట్ జోన్ లో వుంటే కొంత కాలానికి బోర్ కొట్టేస్తుంది. సింపుల్ కథతో పక్కింటి అబ్బాయిలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ అవే సినిమాలు చేస్తూ వుంటే బయటికిరాలేను. ఒక నటుడిగా విభన్నమైన పాత్రలు చేయలేను. అందుకే కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. అయితే ఇందులో మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు నా నుండి రాబోతున్న మూడు సినిమాలు కూడా పూర్తిగా వైవిధ్యమైనవే. ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది.
యదార్ధ సంఘటనలని చెప్పారు కదా.. ప్రముఖ పోలీస్ అధికారుల స్ఫూర్తి ఉంటుందా ?
కొంతమంది ప్రముఖ పోలీస్ అధికారుల స్ఫూర్తితో వున్న సంఘటనలు వుంటాయి. అయితే ఇందులో ఎవరి పేర్లని తీసుకోలేదు. మొత్తం ఒక వ్యవస్థగా చెప్పాం. అలాగే పోలీసు డ్యూటీ మొదలుపెట్టినపుడు చాలా ఆవేశం వుంటుంది. కానీ పోలీసు విధిని రాముడిలా నిర్వర్తించాలి. అల్లూరి పాత్ర ప్రయాణంలో ఆ మార్పుని ప్రేక్షకులు గమనిస్తారు. ఇందులో నా పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ గా కనిపించాలి. ఆ లక్స్ అన్నీ నేచురల్ గా కనిపిస్తాయి.
మీ సినిమాలు తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తవుతాయి కదా.. అల్లూరికి ఎక్కువ రోజుల పట్టిందా ?
అల్లూరి లో చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. అన్నీ అద్భుతంగా వచ్చాయి. యాక్షన్ సీన్స్ చేయడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. అయితే అల్లూరి కోసం వంద రోజులు అనుకున్నాం. 90 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం.
దర్శకుడు ప్రదీప్ వర్మ ఈ కథ మీకే ఎందుకు చెప్పాడని అనిపించిందా ?
అనిపించింది. నాకు పోలీసు పాత్రపై అంత ఆసక్తిలేదు. దర్శకుడు సుధీర్ వర్మ కథ వినమని రెండుసార్లు చెప్పారు. ప్రదీప్ వర్మ వచ్చినపుడు పెద్ద ఆసక్తితో లేను. అయితే ప్రదీప్ కథ చెప్పిన తర్వాత అద్భుతం అనిపించింది. చాలా మంచి కథ. ఎలాగైనా చేయాలనిపించింది. ఈ కథలో నేను ఎలా చేస్తానో కూడా వివరంగా రిఫరెన్స్ లతో సహా చెప్పాడు. ఈ పాత్ర చేయడానికి ఒక విధంగా ధైర్యం ఇచ్చింది దర్శకుడు ప్రదీప్ నే.
యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా ఆలోచనలు చేస్తున్నారు కదా.. మీకు అలాంటి ప్లాన్స్ ఉన్నాయా ?
పాన్ ఇండియా కాదు కానీ వచ్చే రెండేళ్ళలోయూరోపియన్ ఫిల్మ్ తో కలసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నా. మన తెలుగు దర్శకుడే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. యునివర్షల్ అప్పీల్ వుంటుంది. త్వరలోనే వివరాలు చెప్తాను.
మీ ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్ వుంటుంది.. దీని వెనుక స్పెషల్ స్ట్రాటజీ వుందా ?
అదేం లేదండీ. అల్లూరి సినిమాకి ఏడాది పడుతుందని తెలుసు. అందుకే కొత్తవారితో అయితే డేట్స్ విషయంలో ఇబ్బంది వుండదు. అంతే తప్పితే కొత్త వారితోనే పని చేయాలనే ఉద్దేశం లేదు.
కొత్తగా చేయబోయే సినిమాలు ?
మూడు సినిమాలు వున్నాయి. రాజ రాజ చోర ఫేమ్ హాసిత్, సాయి అనే కొత్త దర్శకుడు, హుషారు ఫేమ్ హర్ష తో చేస్తున్నా.