కేరళ రాష్ట్రంలో ఓ కౌన్సిలల్ సమాజం సిగ్గుపడే దారుణానికి పాల్పడ్డాడు. ప్రజలకు రక్షణగా, ఆదర్శంగా నిలవాల్సిన ఒక ప్రజాప్రతినిధి ఏకంగా ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుచును బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ దొంగతనానికి పాల్పడింది కూడా అధికార సీపీఎం పార్టీకి చెందిన సిట్టింగ్ కౌన్సిలర్ కావడం, ఆయనను పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్నూర్ జిల్లా కూతుపరంబ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు కౌన్సిలర్‌గా పి.పి.రాజేష్ పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం, జానకి అనే 77 ఏళ్ల వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా వంటగదిలో పని చేసుకుంటున్నారు. ఇంటి ముందు తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించాడు. ఆమె తేరుకునేలోపే మెడలోని ఒక సవర బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలి కేకలతో చుట్టుపక్కల వారు వచ్చేసరికే దొంగ పారిపోయాడు. నిందితుడు హెల్మెట్ ధరించి ఉండటంతో అతడిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు, సమీపంలోని ఇళ్లు, దుకాణాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజీలో కనిపించిన వాహనం ఆధారంగా దర్యాప్తు చేయగా, ఈ నేరానికి పాల్పడింది స్థానిక కౌన్సిలర్ రాజేష్ అని తేలడంతో పోలీసులు సైతం విస్తుపోయారు.
రెండు రోజుల పాటు విచారణ జరిపిన అనంతరం శనివారం రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడి నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, బాధితురాలు జానకికి తిరిగి అప్పగించారు.
ఈ ఘటన సీపీఎంకు కంచుకోటగా భావించే కన్నూర్ జిల్లాలో జరగడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కౌన్సిలర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఇతర కేసుల్లో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ చర్యకు పాల్పడిన ఆ కౌన్సిలర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.