ఇండస్ట్రీలో ఆడవాళ్లే మోసం.. అమ్మాయిలే ఆఫర్ చేసుకుంటున్నారు : రచయిత శ్రేష్ట

బుధవారం, 20 జూన్ 2018 (15:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై పలువురు పలు విధాలుగా తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా మహిళా రచయిత శ్రేష్ట కూడా తన మనసులోని మాటను వెల్లడించారు. గీత రచయితగా తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని వాపోయింది. పైగా, సినీ అవకాశాల కోసం అమ్మాయిలే తమను తాము ఆఫర్ చేసుకుంటున్నారని అభిప్రాయపడింది.
 
సినిమా ఇండస్ట్రీలో మహిళలకు పురుషులతోపాటు తోటి మహిళల నుంచి కూడా వేధింపులు జరుగుతున్నాయని తెలిపింది. ఓ లెడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ భార్య తనను ఇతర పురుషుల వద్దకు వెళ్లాలని వేధించారని వాపోయింది. ఇలాంటి మహిళలు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, అలాంటి వాళ్ల వల్ల తనలాంటి అమ్మాయిలకు ఎన్నో అవకాశాలు చేజారిపోతున్నాయని శ్రేష్ట చెప్పుకొచ్చారు. 
 
ఇండస్ట్రీలో చాలామంది మగవాళ్లు క్రమశిక్షణతో ఉన్నారని, కొందరు అమ్మాయిలే అవకాశాల కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటున్నారని, ఇలాంటి అమ్మాయిలను తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలామందిని చూశానని చెప్పారు. 
 
'మగవాళ్లను హ్యాండిల్ చేయడం చాలా సులభం. ఆడవాళ్లతో చాలా కష్టం. అమ్మాయిలు చాలా తీయటి మాటలు చెబుతారు. వాళ్లు ఎవరు.. ఏమిటో తెలియదు. ఎటు తీసుకెళ్తారో తెలియదు. ఎవరిని పరిచయం చేస్తారో తెలీదు. మనకే తెలియకుండా మనల్ని ఎవరికి ఆఫర్ చేస్తారో తెలియదు. ఆడవాళ్లతో వెళ్లాలంటే అంత భయం ఉంటుంది. అదే మగాడు అయితే అతని హద్దుల్లో అతను ఉంటాడు.. అతడిని హద్దుల్లో పెట్టే అవకాశం మనకూ ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పి వాళ్లను హద్దుల్లో పెట్టొచ్చు. కానీ ఆడవాళ్లు అలా కాదు.. మన ఇళ్లకే దూసుకొని వచ్చేస్తారు. సో.. ఆడవాళ్లను హద్దుల్లో పెట్టడం కష్టం. నాకు ఎదురైన అనుభవాలను చూస్తే ఆడవాళ్ల వల్లే ఎక్కువ సమస్యలు' అని శ్రేష్ట చెప్పుకొచ్చింది.
 
కాగా, గేయ రచయితగా శ్రేష్ణ ఇటీవల విడుదలైన 'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి' సినిమాలతో పాటు 'అభిమన్యుడు' చిత్రానికి పాటలు రాసింది. ఇపుడు ఈమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు హీరోయిన్లు, ఆర్టిస్టులే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగా గీతరచయితలకు కూడా వేధింపులు తప్పడం లేదని శ్రేష్ట వాపోతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు