నాస్తికుడైన రాజమౌళి ఆస్తికత్వాన్ని బాహుబలిలో ఇంతగా ప్రచారం చేస్తాడా.. చికాకులో ఆస్తికులు

శనివారం, 20 మే 2017 (04:36 IST)
బాహుబలి 2లో సాహురే బాహుబలి పాట రెండోభాగాన్ని ఆకాశానికి లేపి మరీ నిలిపింది. దృశ్య అద్భుతానికి నిలవెత్తు సంకేతంగా ఆ పాట మొత్తం సినిమాను ముందుకు నడిపింది. అలాగే బాహుబలి తొలి భాగంలో కూడా శివుని ఆన పాట సినిమాకళను శిఖరస్థాయిలో నిలిపింది. ఆదివాసీ తల్లి వద్ద పెరుగుతున్న మహేంద్ర బాహుబలి పాత్రధారి ప్రభాస్‌ని ఆకాశంలో నిలిపిన పాట శివుని ఆన. బాహుబలి సినిమాను ప్రభాస్ ఏ స్థాయికి తీసుకుపోనున్నాడో శాంపుల్ ‌గా నిలిపిన మహత్తర పాట అది. బాహుబలిలోని భారీ తనాన్ని శాంపుల్‌గా చూపిన ఆ పాటలో ప్రభాస్ శివలింగాన్ని పెకిలించి భుజాలపై పెట్టుకున్న దృశ్యం -అతిశయోక్తి అనిపించినప్పటికీ) దేశ విదేశాల్లోని ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసింది. అమెరికాలో భాష రాకున్నా అనేకమంది అమెరికన్ మహిళలు ఆ పాట ప్రేరణతో, శివలింగాన్ని ఎత్తిన ప్రభాస్‌ను చూడడానికే థియేటర్లకు క్యూలు కట్టారని అప్పట్లో ప్రోమోలు తెలిపాయి. శివునిపై భక్తిభావాన్ని హిమశిఖరమంత ఎత్తులో నిలిపిన రాజమౌళి అలా శివభక్తిని తారాస్థాయిలో చూపినందుకే ఇప్పుడు చిక్కులో పడ్డారు. నాస్తికుడినని చెప్పుకున్న రాజమౌళి భక్తిరసాన్ని ఇంతగా రంగరించిచూపటం ఏంటని ఆస్తికులు చికాకుపడుతున్నారు. 
 
బాహుబలి గ్రాఫ్ రోజురోజుకు అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోతోంది. దాంతోపాటు చిత్ర దర్శకుడు రాజమౌళిపై వివాదాలు కూడా తక్కువగా పుట్టడంలేదు. తెలుగు చిత్ర సీమలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తర్వాత నాస్తిక భావాలు కలిగిన, పూజా పునస్కారాలను పెద్దగా పట్టించుకోని రాజమౌళి ఆస్తిక, నాస్తిక వాదాలపై బహిరంగ చర్చకు పాల్పడడు. అలాగని తన వ్యక్తిగత విశ్వాసాలను ఆచరించడంలో వెనక్కు తగ్గడు. అదే ఇప్పుడు తనను కొత్త చిక్కుల్లోకి నెడుతోంది. ‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్న సీన్ చూశాక ప్రభాస్‌కు ఎంత భక్తి ఉందో అని అనుకోవడం సహజం. 
 
ఇదే కాదు రాజమౌళి ప్రతి సినిమాలో ఎదో ఒక దేవుడి సన్నివేశం ఉంటుంది. కానీ నిజానికి రాజమౌళి దేవున్నే నమ్మడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. కాని ‘బాహుబలి’లో శివలింగం సన్నివేశాన్ని చూసిన ఏ ప్రేక్షకుడు అయినా.. ఆ సీన్‌లో రాజమౌళి పలికించిన ఎమోషన్‌ను చూసి పులకించి పోయారు. ఇలాంటి మనసును హత్తుకునే సీన్లను తీసిన రాజమౌళి ఆస్తికుడా.. నాస్తికుడా అనే చర్చ రావడం సహజం. అయితే ప్రపంచంలోని చాలా మంది తాము నాస్తికులమా.. ఆస్తికులమా అని నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నారు. 
 
ఒక సామాజిక సర్వే ప్రకారం తాము ఖచ్చితంగా నాస్తికులమే అని ప్రకటించుకున్న వాళ్లు ప్రపంచంలో 80 కోట్ల మంది ఉన్నారు. అలాగే తమకు మతంతో నిమిత్తం లేదని చెప్పుకున్న వాళ్లు 130 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య భారతదేశంలో పెరిగిపోతోందనే వాదన బలంగా ఊపందుకుంటోంది. ఉపనిషత్తులు, వేదాలకు నిలయంగా ఉన్న భారతదేశంలో దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతుండటంపై ఆస్తికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాము నాస్తికులమని చెప్పుకునే ప్రముఖుల భావాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు.
 
బాహుబలిలో శివుని సీన్ అద్భుతంగా చిత్రీకరించిన రాజమౌళి తాను నాస్తికుడినని ప్రకటించడంపై వారు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. నైతిక విలువలకే ప్రధాన్యం ఇస్తామని చెప్పుకునే భౌతికవాదులు, నాస్తికులు కూడా రాజమౌళి తీరును తప్పుబడుతున్నారు. నాస్తికుడైన రాజమౌళి దేవుడు ఉన్నాడనేలా ‘బాహుబలి’లో శివలింగం సీన్‌ను చూపించడం సరికాదని అంటున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆక్షేపిస్తున్నారు.
 
ఈ ఆస్తిక నాస్తిక భేదాలు తన కొంపను ఇలా ముంచుతాయని ఊహించని రాజమౌళి ఈ కొత్త చిక్కేంటి నా ప్రాణానికి వచ్చేటట్టుంది అని మల్లగుల్లాలు పడుతున్నట్లు వినికిడి.

వెబ్దునియా పై చదవండి