కాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తూ, హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనలు చేసిన నటి శ్రీరెడ్డి వ్యవహరాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) సుమోటాగా స్వీకరించి, తెలంగాణ సర్కారు, కేంద్ర ప్రసార శాఖామంత్రికి నోటీసులు జారీ చేసింది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిగివచ్చింది.
నటిపై శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అంతేకాదు మహిళా నటులు తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకునేందుకు వీలుగా క్యాష్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశంలో జెమినీ కిరణ్, మా అధ్యక్షుడు శివాజీ రాజా, నరేష్‌లు ఇటీవల జరిగిన సంఘటనలపై మాట్లాడారు.
శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేయడంతో ఎమోషనల్‌గా ఫీలై మాత్రమే ఆమెపై నిషేధం నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక నుంచి శ్రీరెడ్డి ఏ మూవీలోనైనా, ఎవరితోనైనా నటించవచ్చని, ఆమె కూడా మా కుటుంబంలో సభ్యురాలని తెలిపారు. శ్రీరెడ్డి మా సభ్యత్వం విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.