అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతున్న తమిళ సినీరంగాన్ని ఆదుకునేందుకు హీరోలు, హీరోయిన్లు, కళాకారులు, దర్శకులు తమ పారితోషికంలో 30 శాతం తగ్గించుకోవాలని సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆరు నెలలుగా సినిమాలను విడుదల చేయలేక, నిర్మిస్తున్న సినిమాల షూటింగ్ ఆగిపోయి పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక కష్టాల్లో వున్న నిర్మాతలను తక్షణమే ఆదుకోవాల్సిన బాధ్యత సినీరంగానికి చెందిన కళాకారులందరిపైనా ఉందన్నారు. ఆరుమాసాలుగా షూటింగ్‌లు ఆగిపోయిన చిత్రాల్లో నటిస్తున్న నటీనటులు, దర్శకులు ఒప్పందంలో కుదుర్చుకున్న పారితోషికంలో కనీసం 30 శాతం తగ్గించుకునేందుకు ముందుకురావాలని కోరారు.
తెలుగు సినీరంగంలో హీరోహీరోయిన్లు తమకు తాముగా 30శాతం పారితోషికం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన విషయాన్ని భారతిరాజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు ప్రారంభమైనా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అపుడే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటారని ఆయన కోరారు.